Ramachandra Rao: బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాల్లేవని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramachandra Rao) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ కాంగ్రెస్ లోనే ఉన్నాయని తెలిపారు. తమ పార్టీ నేల గురించి మాట్లాడే ముందు ఆ పార్టీ నేతల గురించి చూసుకోవాలన్నారు. సీఎం కుర్చీ లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి ముందు దాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈనెల 11న జరిగే పోలింగ్ కు జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓట్లు వేయాలని రాంచందర్ రావు కోరారు.
మత రాజకీయం కాదా..
మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు చేస్తున్నారని, మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నది ఏంటని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు ఉన్నది కాంగ్రెస్ వల్లే అని సీఎం చెప్పడం మత రాజకీయాలు కాదా? అని నిలదీశారు. క్రిస్టియన్ల వద్దకు వెళ్ళి బీజేపీకి ఓటు వేయొద్దనడం మత రాజకీయం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని విమర్శిస్తున్నారని, మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏంటో చెప్పాలన్నారు. ఫ్రీ బస్సులు అని డొక్కు బస్సులు ఇచ్చారని, వాటికి ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయని, ముందు వాటిని సరిచేయాలన్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం పేరిట దోచుకుంటే.., కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన పేరిట దోచుకోవాలని చూస్తోందన్నారు.
Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?
మూసీ ప్రక్షాళనపై డీపీఆర్..
బీజేపీ, కిషన్ రెడ్డి ఫోబియా రేవంత్ రెడ్డిని వెంటాడుతోందని రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. అందుకే ఆయన్ను, పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు చేసింది శూన్యమని, రూ.లక్షల కోట్లతో మూసీ చేపట్టాలని చూస్తున్నారని, దానివల్ల ఎవరికి లబ్ధి జరగనుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి చేతనైతే మూసీ ప్రక్షాళనపై డీపీఆర్ ఇవ్వాలని, అలా కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని విమర్శిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు. కమీషన్ల సర్కార్ కొనసాగుతోందని విమర్శించారు. ఇదిలాఉండగా చివరిరోజు ప్రచారంలో భాగంగా వెంగళ్ రావు నగర్ డివిజన్‌లో పాదయాత్ర చేపట్టారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
