Stress Relief: మీరు ఎప్పుడైనా ఒక డార్క్ చాక్లెట్ తిన్న తర్వాత లేదా కొన్ని బెర్రీలు తిన్న తర్వాత సంతోషంగా ఉన్నట్లు అనిపించిందా? అది కేవలం రుచికోసమే కాదు, దాని వెనుక శాస్త్రీయ కారణం ఉందని తాజాగా బయటపడ్డ పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్‌లోని షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించిన కొత్త అధ్యయనం ప్రకారం, ఈ ఆహారాలు కేవలం మన కోరికలను తీర్చడమే కాదు.. మెమరీని పెంచడం, స్ట్రెస్ తగ్గించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కూడా కలిగిస్తాయనిబ తెలిపారు.
మెదడు శక్తికి రహస్యం – “ఫ్లావనాల్స్”
ఈ పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించేది ఫ్లావనాల్స్ (Flavanols) అనే మొక్కల ఆధారిత శక్తివంతమైన సమ్మేళనాలు. ఇవి కోకో, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి ఆహారాల్లో విరివిగా ఉంటాయి. ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ ఫుడ్ సైన్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఫ్లావనాల్స్ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. “ ఫ్లావనాల్స్ వల్ల కలిగే స్ట్రెస్ రియాక్షన్స్ వ్యాయామం వల్ల కలిగే ప్రభావాలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి పరిమిత మోతాదులో ఫ్లావనాల్స్ తీసుకోవడం ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు.” అని నిపణులు తెలిపారు.
పరిశోధన ఎలా చేశారంటే?
శాస్త్రవేత్తలు 10 వారాల వయస్సు గల ఎలుకలపై ప్రయోగం చేశారు. వాటికి రోజువారీగా 25 mg/kg లేదా 50 mg/kg ఫ్లావనాల్స్ ఇవ్వగా, ఇంకో గ్రూప్‌కు కేవలం నీరు మాత్రమే ఇచ్చారు. ఫ్లావనాల్స్ తీసుకున్న ఎలుకలు ఎక్కువ మోటార్ యాక్టివిటీ, ఎక్కువ ఎక్స్‌ప్లోరేటరీ ప్రవర్తన, మెరుగైన లెర్నింగ్, మెమరీ పనితీరు చూపించాయి.
Also Read: Duvvada Couple: దువ్వాడ జంట మంచి మనసు.. కాశీబుగ్గ బాధితులకు ఆర్థిక సాయం.. మేమున్నామంటూ భరోసా!
ఫ్లావనాల్స్ వల్ల డోపమైన్, లెవోడోపా, నోరెపినెఫ్రిన్, నార్మెటానెఫ్రిన్ వంటి మెదడు రసాయనాలు గణనీయంగా పెరిగినట్లు కనుగొన్నారు. ఇవే మోటివేషన్, ఫోకస్, స్ట్రెస్ నియంత్రణకు ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌మిటర్లు. అంతే కాకుండా టైరొసిన్ హైడ్రాక్సిలేస్, వెసిక్యులర్ మోనోఅమైన్ ట్రాన్స్‌పోర్టర్ 2 వంటి ఎంజైములు కూడా పెరిగాయి, అంటే మెదడు సిగ్నలింగ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారింది.
రుచిగా, ఆరోగ్యంగా.. మీ మెదడుకు సహజ బూస్ట్
ఈ అధ్యయనం ప్రకారం, మరి ఎక్కువగా కాకుండా పరిమిత మోతాదులో డార్క్ చాక్లెట్, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు వంటి ఫ్లావనాల్స్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన మెమరీ మెరుగుపడి, ఒత్తిడి తగ్గి, మెదడు పనితీరు మెరుగవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
