Lyrebird: మనం చూసే ఈ ప్రకృతిలో పక్షులు కీలకమైనవి. అలాగే, భూమి పైన ఉండే పక్షులకు వాటి స్వరం ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. వాటి స్వరం ఎలా ఉన్నా మనకి మాత్రం వినడానికి బావుంటుంది. ఇంక ఒక్కో పక్షి ఒక్కోలా అరుస్తుంది. అయితే, ఆస్ట్రేలియా అరణ్యాల్లో దాగి ఉన్న ఒక పక్షి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇది అన్ని పక్షుల కంటే చాలా ప్రత్యేకమైనది. దాని పేరే లైరాబర్డ్ (Lyrebird). ఇది నిజమైన మిమిక్రీ మాస్టర్ అని చెప్పుకోవాలి. ఇది మనిషి మిమిక్రితో పోలిస్తే తక్కువేమీ కాదు. అద్భుతమైన తోక రెక్కలతో పాటు, చుట్టుపక్కల వినిపించే ఏ శబ్దాన్నైనా అచ్చుగుద్దినట్టుగా పలకగలగడం దీని ప్రత్యేకత.
ఈ ప్రపంచంలో రెండు జాతులకి చెందిన లైరాబర్డ్‌కి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1. సూపర్ లైరాబర్డ్ (Menura novaehollandiae)
2. ఆల్బర్ట్ లైరాబర్డ్ (Menura alberti)
ఇది పక్షిప్రియులను మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, ప్రకృతి ప్రేమికులందరినీ ఈ పక్షి తన ప్రతిభతో ఆకట్టుకుంది.
మాటలు మాత్రమే కాదు – అచ్చుగుద్దినట్టు శబ్దాలు కూడా!
లైరాబర్డ్ ప్రత్యేకత దాని “శబ్దాల ఖచ్చితత్వం”లో ఉంది. దాని గొంతులో ఉన్న అత్యంత సంక్లిష్టమైన అవయవం సైరింక్స్ (Syrinx) ద్వారా ఇది విభిన్న శబ్దాలను అత్యంత స్పష్టంగా పలకగలదు. ఇది కేవలం ఇతర పక్షుల స్వరాలను మాత్రమే కాకుండా.. చెయిన్‌సా శబ్దం, కెమెరా షట్టర్, కారు అలారం, బిడ్డ ఏడుపు, మొబైల్ రింగ్‌టోన్ వంటి మానవ సృష్టి శబ్దాలనూ అచ్చుగుద్దినట్టు పలకగలదు. అనేక ఫీల్డ్ స్టడీస్ ప్రకారం, కొన్నిసార్లు ఒక లైరాబర్డ్ పాట మొత్తం ఒకేసారి పాడుతున్నట్టుగా అనిపిస్తుందని వెల్లడించాయి.
ఎక్కడ నివసిస్తాయి?
లైరాబర్డ్స్ ప్రధానంగా ఆస్ట్రేలియా తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల దట్టమైన వర్షారణ్యాలు, యూకలిప్టస్ అడవుల్లో జీవిస్తాయి. కొన్ని జాతులు టాస్మానియాలో కూడా కనిపిస్తాయి. సూపర్ లైరాబర్డ్ విస్తృతంగా ఉన్నప్పటికీ, ఆల్బర్ట్ లైరాబర్డ్ మాత్రం క్వీన్స్‌లాండ్‌లోని చిన్న ఉపఉష్ణ మండల ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. అందుకే అది సంరక్షణ అవసరమైన జాతిగా పరిగణించబడుతోంది.
అడవులను నాశనం చేసే ముందు ఇలాంటి పక్షుల గురించి ఆలోచించండి?
అడవుల నాశనం, వాతావరణ మార్పులు ఈ అద్భుత పక్షుల జీవితానికి ముప్పుగా మారుతున్నాయి. ఇవి ఇప్పటికీ అంతరించిపోలేదు కానీ, పరిస్థితులు ఆ దిశగా కదులుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి సంరక్షకులు చెబుతున్నదేమిటంటే.. లైరాబర్డ్ లాంటి జీవిని కోల్పోతే, మనం ఒక జాతినే కాదు, భూమి మాయాజాలంలోని ఒక అద్భుతాన్ని కోల్పోతున్నాం.
