Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమని, ఇది బీసీ మైనారిటీ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. షేక్‌పేటలో జరిగిన మైనారిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని మహేశ్ గుర్తు చేశారు. ‘జనాభా ప్రాతిపదికన కులాల వారీగా అధికారిక వాటా ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఆలోచనల మేరకు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూనే, మేము బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇచ్చాము.
శక్తి వంచన లేకుండా కృషి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వర్గాలకు గణనీయమైన ప్రాధాన్యత లభించింది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు బీసీ రిజర్వేషన్లు కల్పించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాగే, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యతను నిరూపించుకుంది’ అని మహేశ్ వెల్లడించారు. మైనారిటీలు, బీసీలు ఏకమై కాంగ్రెస్‌కు పూర్తిగా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. నవీన్ విద్యావంతుడు, యువకుడు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినవారు కాబట్టి, ఈ ప్రాంత సమస్యలు, ఇక్కడి ప్రజల కష్టాలు ఆయనకు బాగా తెలుసని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నవీన్‌తో, కాంగ్రెస్‌తో మాత్రమే సాధ్యమవుతుందని, అందుకే ఆయన గెలవడం ఈ ప్రాంత ప్రజలకు అత్యంత అవసరమని మహేశ్ పునరుద్ఘాటించారు.
Also Read: Mahesh Kumar Goud: కవితకు విలీన దినోత్సవానికి ఏం సంబంధం?.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్
తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పగా చేసింది.. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ సర్కార్ ప్రతీ ఏటా రూ.75 వేల కోట్ల వడ్డీలు కడుతోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గాంధీభవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. ‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలవబోతోంది. అందుకే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంలో భాగంగానే బట్టకాల్చి మీద వేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారు.
కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం
బాకీ కార్డు పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పెయిడ్ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదు’ అని మంత్రులు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్‌ఎస్ మిగిల్చిన భారీ వడ్డీలు కడుతూనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రులు తెలిపారు. కానీ, గత ప్రభుత్వం దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలన తెలంగాణ ప్రజల మీద ఒక్కొక్కరిపై రూ.2.50 లక్షల అప్పుల భారం మిగిల్చిందని మంత్రులు ఆరోపించారు. మిగిలిన హామీలను కూడా త్వరలో ప్రజలకు అందజేస్తామని మంత్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read: Mahesh Kumar Goud: బీజేపీ మతవాద శక్తులకు బుద్ధి చెప్పాలి.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
