Jubilee Hills Bypoll (image credit: twitter)
Politics

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విమర్శలకు పదును పెట్టిన బీఆర్ఎస్.. ముస్లిం ఓటర్లను ఆకర్షించేలా స్కెచ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికారంలో ఉన్న పదేళ్లు, గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మిత్రులుగా ఉన్నాయి. ఓటమి తర్వాత ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో జత కట్టినట్లు పలు సందర్భాల్లోనూ స్పష్టమైందని గులాబీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇది బీఆర్ఎస్‌ను మరింత రగిలిపోయేలా చేసింది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై గులాబీ పార్టీ గురి పెట్టింది. విమర్శలకు పదును పెట్టింది.

Also Read: Jubilee Hills bypoll: పీజేఆర్ కుటుంబాన్ని 3 గంటలు బయట నిలపెట్టాడు.. జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

అప్పుడలా.. ఇప్పుడిలా..

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇవ్వడం ఆనవాయితీ. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు బహిరంగంగా పేర్కొన్నారు. అదే విధంగా ఎంఐఎం పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ సైతం కేసీఆర్‌ను అనేక సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్‌కు అండగా ఉంటామని ప్రకటనలు చేశారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను బీఆర్ఎస్ పార్టీకి మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం సిట్టింగ్ స్థానాలుగా ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లతో పాటు రాజేంద్రనగర్‌లో మాత్రమే ఎంఐఎం పోటీ చేసింది. మిగిలిన అన్ని స్థానాల్లో గులాబీ పార్టీకి మద్దతు ఇచ్చింది. అయితే, బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎంఐఎం తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా ప్రచారం చేస్తున్నారు.

రగిలిపోతున్న బీఆర్ఎస్

ఎంఐఎం చర్యలు గులాబీ పార్టీకి మింగుడు పడడం లేదు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ కేడర్‌ను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియను స్పీడ్ చేసింది. డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ఇతర కార్యకర్తలను కారెక్కిస్తున్నది. అంతే కాకుండా ఎంఐఎం పార్టీపై విమర్శలు సైతం చేస్తున్నది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఫారం ఇవ్వలేదు. గులాబీ అధిష్టానం ఒత్తిడితోనే అప్పుడు నవీన్ యాదవ్‌కు ఎంఐఎం టికెట్ ఇవ్వలేదని ప్రచారం ఉన్నది. దీంతో ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండడంతో ఎంఐఎం బహిరంగంగా మద్దతు ఇస్తున్నది. ఈ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను కారెక్కించేలా గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నది.

విమర్శలకు పదును.. ఎంఐఎం కేడర్ టార్గెట్

జూబ్లీహిల్స్‌లో మొత్తం 4 లక్షల ఓటర్లు ఉండగా అందులో ముస్లిం మైనార్టీ ఓటర్లు 1.18లక్షల మంది ఉన్నారు. దీంతో వారిని ఆకర్షించే ప్లాన్‌ను బీఆర్ఎస్ ముమ్మరం చేసింది. ఎంఐఎం పార్టీ మైనార్టీలకు చేసిందేమీ లేదని, రాజకీయం కోసమే పాకులాడుతున్నదని గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మైనార్టీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పని చేస్తున్నదని, మైనార్టీలకు ఎమ్మెల్సీలతో పాటు డిప్యూటీ సీఎం పదవి, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్యేల టికెట్లను ఇచ్చి పెద్దపీట వేశామనే ప్రచారం మొదలు పెట్టారు. అంతేకాదు మైనార్టీల కోసం గురుకులాలు, ఉపకార వేతనాలు, షాదీ ముబారక్ తదితర పథకాలను ప్రవేశపెట్టామని, రంజాన్‌కు తోఫా సైతం ఇచ్చామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయడం లేదని విమర్శలతో పాటు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

మెజార్టీ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. 1.18 లక్షల ఓటర్లలో కనీసం సగం ఓట్లు పడేలా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ పైనా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంఐఎంను ముస్లింల నుంచి దూరం చేయాలనే ప్రణాళికలో భాగంగానే బీఆర్ఎస్ హామీల నినాదం అందుకునే ప్రచారం ఊపందుకున్నది. అంతేకాదు బీఆర్ఎస్ నిలదీయడం వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందని ప్రచారం సైతం ఇటు సోషల్ మీడియా, అటు ఎన్నికల ప్రచారంలో వివరిస్తున్నారు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునే ప్లాన్‌లో గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తాజా సర్వే.. రెండు పార్టీల మధ్య ఎంత శాతం తేడానో తెలుసా?

Just In

01

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీహిల్స్‌లో పోస్టర్ల కలకలం

Warangal Floods: మీ నిర్లక్ష్యం వల్లే వరదలు.. వరద ముంపు బాధితుల ఆగ్రహం..!

Ramagundam: మైసమ్మ గుడుల కూల్చివేత పై హిందూ సంఘాల ఆగ్రహం

Bigg Boss Telugu 9: హౌస్‌లోని అందరి జాతకాలు బయటపడ్డాయ్.. సుమన్ శెట్టి ఒక్కడే టాప్‌లో!

Cotton Farmers: జాతీయ రహదారులపై రైతుల ఆందోళన .. భారీగా నిలిచిపోయిన వాహనాలు