Porter Layoffs 2025: ఈ మధ్య కాలంలో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రముఖ కంపెనీలు లే ఆఫ్ తో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ భారీగా ఉద్యోగులను తీసి వేసింది. ఆన్-డిమాండ్ లాజిస్టిక్స్ స్టార్టప్ పోర్టర్ (Porter) ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగించడం మొదలు పెట్టింది. కంపెనీ అధికారికంగా ఎంత మందిని తీసేశారని వెల్లడించకపోయినా, ఓ ప్రముఖ సైట్ తెలిపిన సమాచారం ప్రకారం 300 నుంచి 350 మంది వరకు ఉద్యోగులను కంపెనీ నుంచి తప్పించిందని తెలుస్తోంది.
మంగళవారం కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, పోర్టర్ ప్రస్తుతం ఒక ట్రాన్సిషన్ దశలో ఉందని పేర్కొంది. “మేము ఒకసారి జరిగే పునర్‌వ్యవస్థీకరణ చర్య చేపట్టాం. దీని ఉద్దేశ్యం సంస్థను మరింత బలమైన, చురుకైన, ఆర్థికంగా స్థిరమైన సంస్థగా మార్చడం. ఈ ప్రయాణంలో, మేము కొంతమంది ఉద్యోగులను ప్రభావితం చేసే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది,” అని సంస్థ తెలిపింది.
పోర్టర్‌లో భారీ ఉద్యోగ కోతలు..
తాజా తొలగింపులు విభిన్న టీమ్‌లలోని ఉద్యోగులను ప్రభావితం చేసినట్లు తెలిసిన సమాచారం. వ్యాపార విభాగాలను విలీనం చేసి, కార్యకలాపాలను సులభతరం చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పోర్టర్ 100–110 మిలియన్ డాలర్ల కొత్త ఫండింగ్ రౌండ్‌ను ముగించబోతోందని వెల్లడించింది. ఇది పూర్తి అయితే, కంపెనీ మొత్తం ఫండింగ్ 300–310 మిలియన్ డాలర్లకు చేరనుంది.
లాభాల్లో ఉన్నా కూడా ఉద్యోగుల తొలగింపు
ఇదివరకే, 2025 ఆర్థిక సంవత్సరంలో పోర్టర్ వ్యాపార పనితీరు గణనీయంగా పెరిగిందని సమాచారం. ప్రస్తుతం, కంపెనీ 57 శాతం ఆదాయం పెరిగి రూ. 4,306 కోట్లకు చేరింది. అదనంగా, FY24లో రూ. 96 కోట్ల నష్టంలో ఉన్న కంపెనీ, FY25లో రూ. 55 కోట్ల లాభంలో ఉంది. లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా ఇలా ఉద్యోగులను సడెన్ గా తీసేస్తుంటే.. ఇంక నష్టాల్లో ఉన్న కంపెనీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాల్సి ఉంది.
దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ లే ఆఫ్ తో పేరుతో మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే, జీతం మీదే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగులను తీసే ముందు కనీసం వాళ్ళకి కొంత సమయాన్ని ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
