Khammam District: సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సులో ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఖమ్మం(Khammam) నుండి సత్తుపల్లి(Sathupally)కి వస్తున్న టీఎస్ 04 యూడీ 1167 నంబర్ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంజిన్ వైపు నుంచి భారీగా పొగ(Smoke) రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు లోపల పొగ కమ్మేయడంతో భయంతో ప్రయాణికులు కిందికి పరుగెత్తి బయటకు వచ్చారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్, కండక్టర్ అప్రమత్తంగా బస్సును రోడ్డుకు పక్కన ఆపినందువల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రయాణికులు ఆగ్రహం..
తరువాత ఇంజిన్‌ను పరిశీలించగా వాటర్ పంప్ జామ్(Water pump jam) కావడంతో ఇంజిన్ వేడెక్కి, ఫ్యాన్ బెల్ట్ తెగిపోవడం వలన పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో బస్సుల మెయింటెనెన్స్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అద్దె బస్సులను సక్రమంగా నిర్వహించకపోవటంతో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల పరిశుభ్రత, సీట్ల పరిస్థితి దారుణంగా ఉందని, బస్సులు కడిగినా సీట్లను శుభ్రం చేయకపోవడం వలన దుమ్ము, మరకలు వస్తున్నాయని వారు తెలిపారు. అద్దాలకు గ్రీజు పెట్టేటప్పుడు సీట్లకూ అంటిపెట్టుకుంటుండటం కూడా డిపో అధికారుల నిర్లక్ష్యాన్ని చూపిస్తోందని ప్రయాణికులు విమర్శించారు. ఈ సంఘటనపై స్థానిక డిపో మేనేజర్ స్పందన కోసం పలుమార్లు సంప్రదించినా ఫోన్‌లో స్పందించలేదు.
Also Read: CM Revanth Reddy: కారు గుర్తుకు ఓటేస్తే.. కమలంకు వేసినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి
