భర్తను కిడ్నాప్ చేయించిన మహిళ
ఆమెతో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆస్తి కోసం కట్టుకున్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించింది ఓ ఇల్లాలు. పత్రాలపై సంతకాలు తీసుకోగానే హత్య కూడా చేయించాలని కుట్ర పన్నింది. అందుకోసం ఏకంగా కోటి రూపాయలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, కేసులో చాకచక్యంగా దర్యాప్తు జరిపిన అంబర్ పేట పోలీసులు ఆమెతో పాటు సుపారీ గ్యాంగులోని 9 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మంగళవారం, అదనపు డీసీపీ జే.నర్సయ్య, ఏసీపీ హరీష్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అమెరికాలో కొన్నేళ్లపాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసి హైదరాబాద్ వచ్చిన శ్యామ్ అనే వ్యక్తి తన రెండో భార్య ఫాతిమాతో కలిసి డీడీ కాలనీలో నివాసముంటున్నాడు.
కాగా, గత నెల 29న రాత్రి 8.30గంటల సమయంలో శ్యామ్ కనిపించకుండా పోయాడు. దాంతో అతడి భార్య ఫాతిమా అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని పేర్కొంది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ కోసం గాలింపు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపారు. పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే గతనెల 31న శ్యామ్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. అతను బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.
Read Also- Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
విచారణలో ఏం చెప్పారంటే
విచారణలో తన మొదటి భార్య మాధవి ఈ కిడ్నాప్ చేయించినట్టు శ్యామ్ వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు మాధవిని బండ్లగూడ జాగీర్‌లోని ఆమె ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆస్తి కోసం తానే శ్యామ్‌ను కిడ్నాప్ చేయించినట్టుగా అంగీకరించింది. దీని కోసం వుండి దుర్గా వినయ్, కట్టా దుర్గాప్రసాద్, కాటమోని పురుషోత్తం, సందోలు నరేశ్ కుమార్, జీ.ప్రీతి, ఎల్.సరిత, కొశకోలు పవన్ కుమార్, నారాయణ రిషికేశ్ సింగ్, పిల్లి విజయ్ తోపాటు మరికొందరికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలిపింది. తాను చెప్పినట్టుగా చేస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పినట్టుగా వివరించింది.
Read Also- Komati Reddy: జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేసీఆర్‌పై పంచ్‌లు
గ్యాంగ్ సభ్యుల అరెస్ట్…
ఈ క్రమంలో పోలీసులు సుపారీ గ్యాంగులోని దుర్గా వినయ్, కట్టా దుర్గాప్రసాద్, కాటమోని పురుషోత్తం, సందోలు నరేశ్ కుమార్, జీ.ప్రీతి, ఎల్.సరిత, కొశకోలు పవన్ కుమార్, నారాయణ రిషికేశ్ సింగ్, పిల్లి విజయ్ లను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో మొదట మంత్రి శ్యామ్ ను బండ్లగూడ ప్రాంతం నుంచి కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా వెల్లడైంది. అక్కడ వీలు కాకపోవటంతో బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ నుంచి కిడ్నాప్ చేయాలని పథకం వేసినట్టుగా తేలింది. చివరకు డీడీ కాలనీలో రెక్కీ జరిపి అక్కడి నుంచి వాహనాలు మారుస్తూ విజయవాడకు తీసుకెళ్లినట్టుగా వెల్లడైంది. బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంక్ నుంచి 10 లక్షల రూపాయలు డ్రా చేయించేందుకు శ్యామ్‌ను ఇక్కడికి తీసుకురాగా అతను తప్పించుకున్నట్టుగా తెలిసింది. కేసులోని మిస్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ కిరణ్ కుమార్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్, ఎస్ఐలు సురేశ్ కుమార్, తరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాములు, మునిరత్నం, కానిస్టేబుళ్లు విక్రమ్, రవి, శివ, శ్రీధర్, భరత్, వంశీ, సుధీర్, అరుణ్, మహిళా హెడ్ కానిస్టేబుల్ భాగ్యలక్ష్మి, కానిస్టేబుల్ రాధికను డీసీపీ బాలస్వామి అభినందించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
