Tandur Land Dispute: ఇన్నేళ్లుగా ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు భూములు కనిపిస్తే కబ్జాలు చేశారు. ఆఖరికి కాందిశీకుల భూములను సైతం వదల్లేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమార్కులు అనుకున్న పని చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది పత్రికా ప్రతినిధులు, అధికార పార్టీ నేతల మద్దతుతో అధికారులు అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారు.
ఎవాక్యు ప్రాపర్టీ ప్రభుత్వ ఆధీనంలో ఉండదా?
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రత్యేక దేశం కావాలని కొంతమంది కోరుకున్నారు. పాకిస్థాన్ దేశం ఏర్పాటై చాలామంది అక్కడకు వెళ్లిపోయారు. వారికి చెందిన ఆస్తులనే కాందిశీకుల భూములంటారు. ఈ భూములపై ఎవరికీ పూర్తి హక్కులుండవని రెవెన్యూ చట్టాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూస్తుంది. తాండూరు పట్టణంలోని ధన్ఘర్గల్లి, వినాయక్ చౌక్‌లోని 5 – 7 – 76/81, 5 – 7 – 78/83 ఇంటి నెంబర్లతో కూడిన 484 చదరపు గజాల స్థలం అలీంఖాన్ అనే వ్యక్తి పేరిట ఉన్నది. ఇతను 1947లో పాకిస్థాన్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఈ ప్రాపర్టీ ఖాళీగా ఉన్నది. అయితే, అధికార పార్టీ నేతల అండదండలతో స్థానికంగా ఉండే మార్వాడీలకు రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: HMDA Scam: రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేట్‌కు ధారాదత్తం!
ఈ స్థలాన్ని కాందిశీకుల ఆస్తిగా పరిగణిస్తూ రెవెన్యూ శాఖ
రెవెన్యూ రికార్డుల్లో కూడా కాందిశీకుల ప్రాపర్టీగానే నమోదు చేశారు. ఈ స్థలాన్ని కాందిశీకుల ఆస్తిగా పరిగణిస్తూ రెవెన్యూ శాఖ తన ఆధీనంలోకి తీసుకున్నది. అనంతరం ఖాళీగా ఉన్న ఇల్లు, స్థలాన్ని 1969లో అప్పటి తాండూరు తహసీల్దార్ ఇదే ప్రాంతానికి చెందిన ఫకీర్ సాబ్, ఫక్రుద్దీన్, పార్వతమ్మ, బుడ్డన్న అనే నలుగురికి లీజుకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అద్దె చెల్లించకపోవడంతో 1989లో పార్వతమ్మకు నోటీసు జారీ చేశారు. మరోసారి 1992లో నలుగురికీ అద్దె చెల్లించాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చారు. ఏ ఉద్దేశంతో అప్పటి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీకి అద్దె చెల్లించాలని నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుందా అనేది అనేక అనుమానాలకు తావిస్తున్నది. అదే ప్రభుత్వ ఆస్తి అయితే తహసీల్దార్లు నోటీసులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తున్నది. కానీ, తర్వాత ప్రైవేట్ పరంగా ఎందుకు మారిపోయిందని స్ధానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆన్‌లైన్‌తో అక్రమాలకు ఆసరా?
భూముల పరిరక్షణ కోసం గతంలో ధరణి, ఇప్పుడు భూ భారతి పోర్టల్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఉన్న వివరాల ఆధారంగానే భూ స్వభావం, విస్తీర్ణం, పట్టాదారుల పేర్లే ఫైనల్ అన్నట్టుగా మారింది. ఇందులోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అక్రమార్కులు రెచ్చిపోయారు. ఎవాక్యు ప్రాపర్టీలను పట్టాగా మార్చుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించిందని సంబరపడ్డారు. అలా తాండూరులోని కాందిశీకుల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఇతరులకు లీజుకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అద్దె డబ్బులను కస్టోడియన్ ప్రాపర్టీలోనే జమ చేస్తూ వచ్చారు. ఇవేమీ రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోకుండా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో పలువురి వ్యక్తులపై భూ క్రయవిక్రయాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడ వ్యాపారులు చేసుకుంటూ అద్దె చెల్లించే వారిని ఎలాంటి కారణం లేకుండా ఖాళీ చేయించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు లీజు నడిపిస్తున్న దుకాణాదారుల పేరు పైనున్న విద్యుత్ మీటర్లను ఆధారాలు లేకుండా చేయడంలో అక్రమార్కులు ప్రధాన పాత్ర పోషించారు. ఇదంతా అధికార పార్టీకి చెందిన నేత వెనక ఉండి నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది.
Also Read: TG DGP: కంటతడి పెట్టిన డీజీపీ.. వీడ్కోలు సభలో.. బాధను వెళ్లగక్కిన జితేందర్
రెవెన్యూ అధికారులే గ్రీన్ సిగ్నల్
అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి ఓ నేత ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులున్నాయి. ఆ ఆస్తులను ఏ విధంగా తమ అధీనంలోకి తీసుకోవాలనే పనిలో నిమగ్నమైనట్లు తాండూరు నియోజకవర్గంలో చర్చ సాగుతున్నది. అక్రమంగా ఇసుక దందానైనా, మైనింగ్ మాఫియా, భూ అక్రమాలనైనా తమ నేతృత్వంలోనే నడవాలనే శాసనం రాశారని తెగ మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలోని నేతలకు తామేమి తక్కువ తినలేదని బల నిరూపణలో ఇదంతా నడిపిస్తున్నట్లు కనిపిస్తున్నది. గత ప్రభుత్వం నుంచే ఎవాక్యు ప్రాపర్టీకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నది. అప్పటి నుంచి ఈ ప్రాపర్టీని దక్కించుకునేందుకు పోటీ పడ్డట్లు తెలుస్తున్నది. ఎలాగైనా దక్కించుకునేందుకు కొంతమంది పత్రికా ప్రతినిధులతో చేతులు కలిపి విషయం బయటకు పొక్కకుండా వ్యవహారం చేశారు.
రెవెన్యూ చట్టంలోని లొసుగులను అడ్డం
ప్రాపర్టీని రెగ్యులరైజ్ చేసేటప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించి నాలుగైదు డాక్యుమెంట్లుగా క్రయ విక్రయాలు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ల సహాయంతో ఇదంతా నడిపించినట్లు తెలుస్తున్నది. 2022 జనవరిలో లీజుదారుల్లో ఒకరైన ఫక్రుద్దీన్ భార్య షకినాబీ పేరిట మున్సిపాలిటీలో అసెస్మెంట్ చేయించారు. అప్పట్లో రెవెన్యూ డివిజన్ అధికారి, మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా వ్యవహరించారు. రెవెన్యూ చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని 484 చదరపు గజాల స్థలాన్ని 4 బిట్లుగా విడదీసి, నాలుగు అసెస్‌మెంట్లు చేశారు. 5 – 7 – 75, 76 స్థలానికి 1506003640 అసెస్‌మెంట్ నంబర్ ఇచ్చారు. 5 – 7 – 76/1 దుకాణానికి 1506003641 నెంబర్, 5 – 7 – 77కు 1056003642 నెంబర్, 5 – 7 – 78కు 1506003643 నెంబర్, 5 – 7 – 79 దుకాణానికి 1506003644 అసెస్‌మెంట్ నెంబర్ కేటాయించారు. అనంతరం ఈ స్థలానికి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అసెస్‌మెంట్ అయిందనే సాకుతో షాకినాబీ పేరు నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి పేరిట అప్పటి సబ్ రిజిస్ట్రార్ సేల్ డీడ్ చేశారు. గత రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు, ముగ్గురి పేర్లపై మార్టిగేజ్ చేసిన అనంతరం చివరకు తాండూరు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ విషయమై రెండేళ్ల క్రితం ఓ లీజుదారుడు కోర్టును ఆశ్రయించగా అప్పట్లో ఇంజెక్షన్ ఆర్డర్ సైతం జారీ చేశారు.
సుమోటాగా కేసు స్వీకరించాలి
ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు ఈ విషయాన్ని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టాలని స్ధానికులు, ప్రజా సంఘాలు, బీజేపీ నేతలు కోరుతున్నారు. కాందిశీకుల భూమలను రెగ్యులరైజ్ చేసేందుకు సహకరించిన అధికార పార్టీ నేతలు, పాత్ర వహించిన అధికారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులు క్రమ క్రమంగా అన్యాక్రంతమైతున్నాయని వాపోతున్నారు.
