Alcohol Survey: బీరు తాగి గంతేస్తాం… విస్కీ తాగి చిందేస్తాం
మద్యపానంలో దేశంలో తెలంగాణ మహిళలకు 4వ స్థానం
వెల్లడించిన తాజా జాతీయ సర్వేలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మగవాళ్లకన్నా మేమేం తక్కువ తాగామా? అని నిరూపిస్తున్నారు రాష్ట్ర మహిళామణులు. పెగ్గు మీద పెగ్గు వేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. మద్యపానంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేల్లో (Alcohol Survey) దేశం మొత్తం మీద మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా (పురుషులు, మహిళలు కలిపి) 3వ స్థానంలో ఉంది. ఈ సర్వేలో గమనించాల్సిన అంశం ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలే ఎక్కువగా మందు కొడుతుండటం. మన రాష్ట్రంలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగిపోవటానికి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
పండుగు వచ్చినా…
తెలంగాణలో పండుగ వచ్చినా… పుట్టిన రోజు జరిగినా… చావైనా సరే మద్యం సేవిస్తారు. కొన్నిసార్లు సంతోషంలో దావత్‌లు చేసుకుంటుంటే మరికొన్నిసార్లు విషాదంలో బాధను అధిగమించడానికి సేవిస్తున్నారు. ఇక, మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్, స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డితో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మద్యం వినియోగం ఏయేటికాయేడు గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మద్యం సేవించటం ఒక ఫ్యాషన్‌గా మారిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మందు తాగుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతుండటం, సిటీల్లో కూడా పార్టీ కల్చర్ ఎక్కువ అవుతుండటంతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో మద్యం సేవిస్తున్న మహిళల శాతం 6.7గా ఉండటం పరిస్థితికి దర్పణం పడుతోంది. జాబితాలో మనకన్నా ముందు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. తరువాతి స్థానాల్లో జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్ ఘడ్ నిలిచాయి.
Read Also- Big TV Vijay Reddy: బిగ్ టీవీ అధినేత పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమానికి చేయూత
పెరుగుతున్న విస్కీ విక్రయాలు…
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు ఎక్కువగా కల్లు సేవించే అలవాటు ఉండేది. ఏ శుభ కార్యం జరిగినా… విషాదం ఎదురైనా కల్లు ముంతలు తప్పనిసరిగా కనిపించేవి. అయితే, ప్రస్తుతం పరిస్థితి మారింది. విస్కీ వినియోగం గణనీయంగా పెరిగింది. దీనికి కారణం చీప్ లిక్కర్ రావటం…90ఎంఎల్ బాటిళ్లు అందుబాటులో ఉండటమే అని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో 2025 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విభాగంలో 40.17 కోట్ల కేసుల విస్కీ అమ్మకాలు జరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి. దీంట్లో 9శాతం వాటాతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.
Read Also- 45 The Movie: ‘45 ది మూవీ’ నుంచి ‘అఫ్రో టపాంగ్’ సాంగ్ వచ్చింది చూశారా..
ఏడాదికి రూ.3,061 ఖర్చు
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మద్యం కోసం ఏడాదికి సగటున 3,061 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఇది అత్యధికం కావటం గమనార్హం. జాతీయ సగటు కేవలం 486 రూపాయలు మాత్రమే ఉంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్కరు సగటున 2,926 రూపాయలు మద్యం కోసం వెచ్చిస్తున్నారు. ఇది దేశంలో మూడో స్థానం. పల్లెల్లో కల్లు, సారా వంటి వాటికి ఒక్కొక్కరు 518 రూపాయలు ఖర్చు చేస్తుండగా పట్టణ ప్రాంతాల్లో ఇది కేవలం 87 రూపాయలు మాత్రమే ఉంది.
