Arrive Alive program: త్వరలోనే అరైవ్…అలైవ్ కార్యక్రమం
వెల్లడించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. హత్యలకు గురై చనిపోతున్న వారికన్నా యాక్సిడెంట్లలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు విచారం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు త్వరలోనే ‘అరైవ్…అలైవ్’ అనే కార్యక్రమాన్ని (Arrive Alive program) ప్రారంభించనున్నట్టు తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం పోలీసు ఉన్నతాధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రత నిపుణులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యాక్సిడెంట్లను తగ్గించటానికి పోలీస్, రవాణ శాఖలు, కార్పొరేట్, విద్యా, స్వచ్ఛంధ సంస్థలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. దీనికోసం స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ఈనెల 9 లేదా 10న జరిగే తదుపరి సమావేశంలో దానిపై చర్చ జరపాలని చెప్పారు. ఇక, వేర్వేరు రాష్ట్రాలు, ప్రాంతాల్లో రోడ్డు భద్రతకు సంబంధించి అమల్లో ఉన్న ఉత్తమ విధానాలను పరిశీలించి మన రాష్ట్రంలో ఆచరణ యోగ్యమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
Read Also- Kasibugga stampede: కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
15 రోజులపాటు అరైవ్…అలైవ్..
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 16వ తేదీ నుంచి పదిహేను రోజులపాటు అరైవ్…అలైవ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఈనెల 16న జరిగే ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల స్మారక దినం సందర్భంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించటం, నియమాలను ఖచ్చితంగా పాటించేటట్టు చేయటం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించటం, డిఫెన్సీవ్ డ్రైవింగ్ ను ప్రోత్సహించటం ద్వారా ప్రమాదాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా నిర్వహించనున్నామన్నారు. స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు కొన్ని సూచనలు చేస్తూ ప్రతీ వాహన డ్రైవర్ సేఫ్టీ కనెక్ట్ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్ ను ఉపయోగించేట్టు చూడాలన్నారు.
ఈ యాప్ డ్రైవింగ్ తీరును విశ్లేషించి భద్రతా ప్రమాణలను పాటించేలా చూస్తుందని చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలపై సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే దీనిని పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రతా పార్కులను ప్రారంభించాలని చెప్పారు. సమావేశంలో అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఏడీజీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, ఎం.రమేశ్, కే.రమేశ్ నాయుడు, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also- KK survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేకే సర్వే వచ్చేసింది.. గెలుపు ఎవరిదంటే?
టప్పాచబుత్రా సీఐపై సజ్జనార్ వేటు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: టప్పాఛబుత్రా పోలీస్ స్టేషన్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ చర్యలు తీసుకున్నారు. పది రోజుల క్రితం పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు, స్థానికంగా ఉంటున్న వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ మేరకు అర్ధరాత్రే స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. అయితే, ఫిర్యాదు అందిన వెంటనే కాకుండా మరుసటి రోజు ఉదయం కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లటంతో ఏసీపీతో విచారణ జరిపించి నివేదిక తెప్పించుకున్నారు. దీంట్లో సీఐ అభిలాష్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో ఇద్దరు అధికారులు సస్పెండ్ కావటం గమనార్హం. కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడిన నిందితుడు పారిపోవటంలో సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్రల్ జోన్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ను ఇటీవలే విధుల్లో నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
