Tata Bike – Fact Check: భారత్ కు చెందిన దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా.. త్వరలోనే టూవీలర్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టాటా మోటార్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఇప్పటివరకూ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్న ఆ సంస్థ నుంచి త్వరలో అతి తక్కువ ధరకే బైక్స్ రాబోతున్నట్లు నెట్టింట తీవ్రంగా చర్చ నడుస్తోంది. అంతేకాదు మార్కెట్ లోకి రాబోయే టాటా బైక్స్ (Tata Bikes) ఇవేనంటూ కొన్ని ఫొటోలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. బయట జరుగుతున్న గట్టి ప్రచారాన్ని చూసి కొందరు నిజమేనని నమ్ముతుంటే.. మరికొందరు మాత్రం ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా బైక్స్ వెనుక జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
బైక్‌పై జరుగుతున్న ప్రచారం
టాటా కొత్త బైక్స్ అంటూ రెండు రకాల మోడల్ బైక్స్ ఫొటోలు నెట్టింట కనిపిస్తున్నాయి. అందులో ఒకటి రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీకి చెందిన 350సీసీ మోడల్ కు దగ్గరగా ఉండగా.. మరొకటి హీరో స్ప్లెండర్ ప్లస్ ను తలపిస్తోంది. మెుదటి మోడల్ బైక్ 125 సీసీ, రెండో బైక్ 100సీసీతో రాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ బైక్స్ లీటర్ కు 95 కి.మీ వరకూ మైలేజ్ ఇస్తాయని అంటున్నారు. 11.5bhp పవర్, 11Nm టార్క్, డిజిటల్ స్పీడో మీటర్, ఎల్ఈడీ లైట్స్, అలాయ్ వీల్స్ కలిగిన ఈ టాటా బైక్స్ ధర రూ.55,000-60,000 మధ్యలోనే ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.
Tata bike market मैं 😍#tatabike #TataMotors pic.twitter.com/M7fj933bkD
— rajat singh bhadoria (@rajat_bhadoria) October 31, 2025
ప్రచారంలో వాస్తవమెంతా?
2026లో టాటా బైక్స్ లాంచ్ కాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టాటా మోటర్స్ ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన చేయలేదు. టాటా మోటార్స్ కు సంబంధించిన వెబ్ సైట్ లోనూ చిన్న ప్రకటన కూడా కనిపించలేదు. అలాగే జిగ్ వీల్స్ (ZigWheels) వంటి విశ్వసనీయ ఆటోమెుబైల్ వెబ్ సైట్ సైతం టాటా బైక్ (పెట్రోల్ గానీ, ఎలక్ట్రిక్ గానీ) రాబోతున్నట్లు ఎలాంటి ధ్రువీకరణ చేయలేదు. అయితే ప్రస్తుతం టాటా మోటార్స్.. నెక్సాన్ ఈవీ (Nexon EV), తియాగో ఈవీ (Tiago EV), పంచ్ ఈవీ (Punch EV) వంటి ఎలక్ట్రానిక్ కారులపై ఫోకస్ పెట్టింది. ఆ కార్లకు సంబంధించి పత్రికా ప్రకటనలు సైతం విడుదల చేస్తోంది. వాటిలో ఎక్కడా కూడా టాటా బైక్స్ గురించి టాటా మోటార్స్ ప్రస్తావించకపోవడం గమనార్హం. దీనిని బట్టి టాటా బైక్స్ అంటూ బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమవుతోంది.
Also Read: Midhun Reddy: వైసీపీ ఎంపీకి అరుదైన గౌరవం.. ఐరాసలో ప్రసంగించిన మిథున్ రెడ్డి
వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం..
అయితే సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోలు ఏఐ లేదా ఎడిట్ చేసిన ఫొటోలని తేలింది. ఇదే అంశాన్ని ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్లు సైతం ధ్రువీకరించాయి. ఏఐ నిర్ధారణ వెబ్ సైట్స్ లో టాటా బైక్స్ ఫొటోలు పెట్టి చెక్ చేయగా 80-90% ఏఐ అని సమాధానం వచ్చింది. అవి కేవలం డూప్లికేట్ ఫొటోలని, అఫిషియల్ కాదని ఏఐ టూల్స్ పేర్కొన్నాయి. అంతేకాదు ఫేస్ బుక్, ఎక్స్, యూట్యూబ్ లో చూసిన టాటా బైక్ డిజైన్స్ కూడా అధికారికమైనవి కాదని తేల్చి చెప్పాయి. కాబట్టి ఏఐ బైక్స్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి.. ఎవరూ మోసపోవద్దని ఫ్యాక్ట్ చెక్ టీమ్స్ స్పష్టం చేస్తున్నాయి.
