Telangana BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం రోజురోజుకూ దగ్గర పడుతున్నది. అయినా కూడా కాషాయ పార్టీ అలసత్వాన్ని ఏమాత్రం వీడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక మొదలు, ప్రచారం వరకు అన్ని అంశాల్లోనూ వెనుకంజలోనే ఉన్నదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ ఉన్నది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నికను పార్టీ లైట్ తీసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రచారానికి కేవలం 9 రోజులే ఉన్నా, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఒకరిద్దరు నేతలు తప్పితే ఎవరూ ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్(Congress) ఒక్కో డివిజన్ బాధ్యతలను ఇద్దరేసి మంత్రులకు అప్పజెప్పింది. ఒక డివిజన్‌కు మాత్రం పూర్తి బాధ్యతలు సీతక్కకు ఇచ్చింది. బీఆర్ఎస్ పెద్దలు కూడా ప్రచారంలో ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా డివిజన్లకు ఇన్‌ఛార్జ్‌లను నియమించే యోచనలోనే ఉన్నది.
చివరి రోజుల్లో ప్రచారం.. ఉపయోగం ఉంటుందా?
సెగ్మెంట్‌లో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. వీటిలో తమ ఎంపీ(MP)లు, ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీ(MLC)లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలనే యోచనలో కాషాయ పార్టీ ఉన్నట్టు సమాచారం. ఈ నియామకంపై కూడా పార్టీ తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలుస్తున్నది. అలాంటిది పోలింగ్ సమయం సమీపిస్తున్నా ఇంకా ఇన్‌ఛార్జ్‌లు నియమించే ప్రక్రియలోనే పార్టీ ఉండడం చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చివరి రోజుల్లో ఇన్‌ఛార్జ్‌లుగా ఎం(MP)పీలు, ఎమ్మెల్యేలు(MLA), ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించినా క్షేత్రస్థాయిలో ప్రచారం ఎప్పుడు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. 9 రోజులే మిగిలి ఉన్న తరుణంలో ఇప్పుడు ఫోకస్ పెంచి ఉపయోగమేంటనే ప్రశ్నలు శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. కార్పెట్ బాంబింగ్ పేరిట మంగళవారం పలు ప్రాంతాల్లో ఏకధాటిన నేతలంతా విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి పరిస్థితి యథావిధిగానే ఉన్నది.
Also Read: Montha Cyclone: నిండా ముంచిన మొంథా.. ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం
చివరి వారం కీలకం.. కానీ
ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాషాయ పార్టీ ఒక్కో డివిజన్‌కు ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం. ఆ డివిజన్‌లో ప్రచారానికి సంబంధించిన పూర్తి బాధ్యత వారిపైనే ఉండనున్నది. నేడో, రేపో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించే అవకాశమున్నది. నవంబర్ 2 నుంచి వీరు ప్రచారంలోకి దిగే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. వారితో పాటు జూబ్లీహిల్స్ ప్రచారానికి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు 300 మంది ముఖ్య కార్యకర్తలను దింపేలా ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో కార్పెట్ బాంబింగ్ స్థాయికి మించిన ప్రచారం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే నెల 3 నుంచి ప్రచార పర్వంలోకి జాతీయ నేతలు కూడా ఎంటరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. చివరి వారంలో ప్రచారం పీక్ స్టేజీకి తీసుకెళ్లి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలనే వ్యూహంతో కమలనాథులు ఉన్నారు. మరి ఇంత తక్కువ సమయంలో వారు ప్రచారం నిర్వహించేదెన్నడు? ఓటర్లను కలిసేదెన్నడనే ప్రశ్నలు శ్రేణుల నుంచి వస్తున్నాయి.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				