IRCTC News: భారత రైల్వే వ్యవస్థలో ఐఆర్‌సీటీసీ అత్యంత కీలకంగా మారిపోయింది. రైలు టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్ నుంచి, క్యాటరింగ్, టూరిజానికి సంబంధించిన సేవలను సమర్థవంతంగా అందిస్తోంది. ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన సేవలు, పారదర్శకమైన బుకింగ్ సిస్టమ్, ఆకర్షణీయమైన టూరిజం ప్యాకేజీలు వంటి సేవలను టెక్నాలజీకి అనుసంధానించి అందిస్తోంది. సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణల విషయంలోనూ ఐఆర్‌సీటీసీ ముందుంది. ఏఐ, డేటా అనాలిసిస్, ఆడియో-విజువల్ వంటి వినూత్న సేలను సైతం ప్రవేశపెడుతుంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. అయితే, మరిన్ని అధునాతన మార్పులు అందుకునే క్రమంలో, నవంబర్ 1-2 తేదీల మధ్య సేవలు (IRCTC News) ప్రభావితం కానున్నాయి.
పోర్టల్ మెయింటనెన్స్ కార్యకలాపాల దృష్ట్యా నవంబర్ 1, అంటే శనివారం రాత్రి 11.45 గంటల నుంచి, నవంబర్ 2 (ఆదివారం) ఉదయం 5.30 గంటల వరకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సేవల విషయంలో అంతరాయాలు ఏర్పడనున్నాయి. ఐఆర్‌సీటీసీ, క్రిస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (CRIS) మధ్య పీఎన్ఆర్, డేటాబేస్ ఫైళ్ల అనుసంధానం కారణంగా తాత్కాలిక సేవలు నిలిపివేయనున్నట్టు మాల్డా డివిజన్ పీఆర్‌ఏ సాహా వెల్లడించారు. దీనినే డౌన్‌టైమ్ అని కూడా వ్యవహరిస్తారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ సమయంలో సుమారు 6 గంటలపాటు వెబ్‌సైట్ సేవల్లో అంతరాయం కలుగుతుందని వివరించారు. కాగా, ఐఆర్‌సీటీసీ కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ప్రభావితం అయ్యేవి ఇవే
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మెయింటెనెన్స్ పనుల రీత్యా ప్రభావితం కానున్న సేవల జాబితాలో కరెంట్ బుకింగ్స్, ఇంటర్నెట్ బుకింగ్, చార్టింగ్, యాప్ ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే, నవంబర్ 2న ఉదయం 5.30 గంటల తర్వాత బుకింగ్ వ్యవస్థలు తిరిగి అందుబాటులోకి వస్తాయనే మెసేజ్‌ను డిస్‌ప్లే చేస్తుంది. అయితే, వెబ్‌సైట్ పనిచేయకపోయినప్పటికీ, మెయింటెనెన్స్ సమయంలో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్యాసింజర్లు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ సమయంలో ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ సేవలు, చార్టింగ్, యాప్‌లు, 139 కాల్ ఎంక్వైరీ వంటి సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి, ప్యాసింజర్లు ముందుగానే ప్రయాణానికి సంబంధించిన ప్లాన్స్ చేసుకోవాలని, టికెట్ బుకింగ్‌లు పూర్తి చేసుకోవడంతో పాటు ఈ–టికెట్లు ప్రింట్ చేసుకోవాలని, పీఎన్ఆర్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
మెయింటెనెన్స్ సేవలకు సంబంధించిన సమాచారం, షెడ్యూల్స్‌లో మార్పుల కోసం అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, రైల్వే సోషల్ మీడియా మార్గాల ద్వారా ప్యాసింజర్లు అప్‌డేట్‌లు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
