Drinking Culture: ఇతర దేశాల్లో మద్యం తాగడం అనేది సర్వ సాధారణం. ఇది వాళ్ళకి అలవాటులాగా ఉంటుంది, తీరిక సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి బార్‌లు లేదా పబ్‌లలో కూర్చుని డ్రింక్స్ ఆస్వాదిస్తారు. ఇక్కడ ఆహారం కంటే కబుర్లు, సంభాషణలే ముఖ్యం. వాళ్లు సాధారణంగా వైన్, బీర్, లేదా తేలికైన కాక్‌టెయిల్స్ తాగుతారు.
భారతదేశంలో సాధారణంగా పార్టీలు లేదా దావత్‌లలో మద్యం తాగడం ఒక అలవాటుగా మారింది. ఇక్కడ ఆహారం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. మద్యం తాగడం అంటే స్నాక్స్‌తో కలిపి ఉంటుంది. ఇక్కడ తాగే మద్యం .. విస్కీ, రమ్, బీర్. చాలా సందర్భాల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. మందు ఒక్కటే తాగకుండా ఆహారం, స్నాక్స్‌తో కలిపి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇది మద్యం ప్రభావాన్ని కాస్త తగ్గిస్తుంది.
భారతీయ సంస్కృతిలో ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఖాళీ కడుపుతో మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని అందరూ నమ్ముతారు. అందుకే, తాగే ముందూ, తాగుతున్నప్పుడూ బాగానే ఆహారం తీసుకుంటారు. అంతేకాక, మద్యం ఆకలిని పెంచుతుంది, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో శక్తితో నిండిన ఆహారాల కోసం ఆకలి మొదలవుతుంది. మద్యం తాగిన తర్వాత ఎక్కువగా తింటారు. అయితే, ఇలా ఎందుకు తింటారో ఎవరికీ తెలియదు. అసలు ఆల్కహాల్ ఆకలిని ఎలా పెంచుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
ఆల్కహాల్ ఆకలిని ఎలా పెంచుతుంది?
మెదడుపై ప్రభావం: ఆల్కహాల్ మెదడులోని హైపోథాలమస్ అనే భాగాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది ఆకలి, శరీర ఉష్ణోగ్రత, ఇతర కీలక విధులను నియంత్రిస్తుంది. 2017లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఆల్కహాల్ న్యూరాన్లను సక్రియం చేస్తుంది, ఇవి ఆకలిని సూచిస్తాయి, దీంతో మద్యం సేవించిన వారికి తినాలని కోరిక పెరుగుతుంది.
రుచి, వాసన: ఆల్కహాల్ రుచి, వాసనల పట్ల సున్నితత్వాన్ని పెంచుతుంది, దీంతో ఆహారం మరింత రుచికరంగా అనిపిస్తుంది. ఈ ఇంద్రియాల పెరుగుదల హైపోథాలమస్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.
రక్తంలో చక్కెర తగ్గడం: ఆల్కహాల్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, దీంతో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. మెదడు దీన్ని ఆకలిగా మారుస్తుంది. అందుకే కొందరు మామిడి కాయ చెట్నీని తింటారు. ఇంకొందరు తీపి లేదా ఉప్పగా ఉండే ఆహారాల కోసం ఆరాటపడుతుంటారు.
స్వీయ నియంత్రణ తగ్గడం: మద్యం తాగడం వల్ల నిర్ణయాలు తీసుకునే శక్తి, స్వీయ నియంత్రణ బలహీనపడతాయి. దీంతో ఆరోగ్యకరమైన ఆహారం కంటే వేయించిన, జంక్ ఫుడ్‌ల వైపు మొగ్గు చూపుతుంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
