CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ; విశ్వనాథన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశం ప్రధానంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులు డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, వివిధ జిల్లాల నుంచి అందిన నివేదికలను కేసీ వేణుగోపాల్‌కు వివరించారు.
పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించేలా ఉండాలి
డీసీసీ అధ్యక్షులుగా ప్రజా సంబంధాలు బలంగా ఉన్న, సమర్థవంతమైన నాయకులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఉద్ఘాటించినట్టు సమాచారం. డీసీసీ అధ్యక్షులుగా ఎంపికయ్యేవారు ప్రజలతో మమేకమ పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించేలా ఉండాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికతో పాటు, త్వరలో ఏర్పాటు చేయబోయే టీపీసీసీకొత్త కార్యవర్గం కూర్పుపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అన్ని వర్గాలకు, ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించారు.
ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలు
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర సంస్థాగత ఎన్నికల దృష్ట్యా పార్టీ సంస్థాగత నిర్మాణం త్వరగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇతర అంశాలపై చర్చ డీసీసీ ఎంపిక ప్రక్రియతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలు అమలు తీరు, వాటి పురోగతిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. గ్యారంటీ పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నందున, త్వరలోనే కొత్త అధ్యక్షుల జాబితాను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: CM Revanth Reddy: బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి
