Sleeper Bus Fire Accidents: అంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. ప్రతీ ఒక్కరినీ కలిచి వేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న వేమూరి కావేరి ట్రావెల్స్ (Vemuri Kaveri Travels) స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు కిటికీ అద్దాల గుండా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. స్లీపర్ బస్సు ప్రమాదానికి గురికావడంలో ఇదే తొలిసారి కాదు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన స్లీపర్ బస్ అగ్ని ప్రమాదాల్లో 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 2025
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి టావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున కర్నూలు శివార్లలో ప్రమాదానికి గురైంది. రోడ్డు మీద పడి ఉన్న బైక్ ను డ్రైవర్ చూసుకోకుండా ఈడ్చుకెళ్లడంతో నిప్పు రవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. దీంతో అందరూ చూస్తుండగానే పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
అక్టోబర్ 2025
ఈ నెలలోనే జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
మే 2025
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ప్రైవేట్ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
జూలై 2023
మహారాష్ట్రలోని బుల్దాణాలో 2023 జులైలో ఓ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. విద్యుత్ స్తంభంతో పాటు రోడ్డు డివైడర్ ను బలంగా ఢీకొట్టడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డార.
నవంబర్ 2023
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ప్రైవేటు స్లీపర్ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు డివైడర్ ను బస్సు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. పలువురు కిటికీల గుండా దూకేసి ప్రాణాలతో బయటపడ్డారు.
జూన్ 2022
గుజరాత్ లోని నవసారి ప్రాంతంలో ప్రైవేటు బస్సు ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 21 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు.
Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో బైకర్ ఫ్రెండ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
అక్టోబర్ 2013
తెలంగాణలోని మహబూబ్‌నగర్ లో ఓ ప్రైవేట్ ఏసీ బస్సు.. కల్వర్ట్ ను ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంక్ పగిలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
