War Of Words Over Performance Of EVMs:సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల పనితీరుపై పలు రాజకీయ పక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈవీఎంల మీద చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీల వాదనకు బలాన్ని చేకూర్చుతున్నాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను హ్యాక్ చేసే ముప్పు ఉందని, కనుక ఈవీఎంలను తొలగించాలని మస్క్ అభిప్రాయపడ్డారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్ట్‌కు ఎలాన్ మస్క్ పై విధంగా స్పందించారు. ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనీ, అదృష్టవశాత్తూ ప్రత్యామ్నాయంగా.. బ్యాలెట్ పేపర్ కూడా ఉంది గనుక సమస్యను గుర్తించి, ఓట్ల లెక్కను సరి చేశారని, బ్యాలెట్ పేపర్ ట్రయల్ లేని ప్రాంతాల్లో ఇదే జరిగితే పరిస్థితి ఏంటని రాబర్ట్ ప్రశ్నించారు. తమ ప్రతి ఓటు లెక్కించారని, తమ ఎన్నికల్లో హ్యాకింగ్ జరగదని అమెరికా పౌరులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ నేపథ్యంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ల వాడకమే మంచిదని రాబర్ట్ పేర్కొన్నారు.
అయితే, మస్క్ చేసిన ట్వీట్ అమెరికాకు సంబంధించినదే అయినా.. దీనిపై బీజేపీ నేత, గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇంటర్నెట్‌తో అనుసంధానమైన ఈవీఎంల గురించే మస్క్ మాట్లాడారనీ, కానీ, భారత్‌లో వాడే సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారుచేయలేరనే భావమూ ఆయన మాటల్లో ధ్వనించిందని, అది సరికాదని రాజీవ్ వ్యాఖ్యానించారు. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవనీ, వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటి కనెక్టివిటీ ఏదీ ఉండదని, ఇక్కడి ఈవీఎంలను రీప్రోగ్రామ్ చేయటమూ కుదరదని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌లో వాడే సురక్షితమైన ఈవీఎంల తయారీ సాధ్యమేనని, అవసరమైతే దీనిపై ప్రపంచ దేశాలకు శిక్షణ ఇవ్వడానికి కూడా తమ దేశం సిద్ధంగా ఉందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అయితే, రాజీవ్ చేసిన ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ, ‘దేనినైనా హ్యాకింగ్ చేయడం సాధ్యమే’ అని బదులిచ్చారు. దీనిపై రాజీవ్ చంద్రశేఖర్ బదులిస్తూ.. ‘ఏదైనా సాధ్యమే అనేది సాంకేతికంగా నిజమే కావచ్చు. ల్యాబ్ స్థాయి సాంకేతికత, సరిపడా వనరులు ఉంటే ఆకాశంలో తిరిగే విమానాలనూ హ్యాక్ చేయవచ్చని, కానీ ఈ వాదన ఈవీఎంలకు వర్తించదన్నారు. పేపర్ ఓటింగ్ కంటే ఆచరణాత్మకంగా ఈవీఎంలే మేలని, అవి సురక్షితమైనవని అన్నారు. ఈ ఆసక్తికరమైన సంభాషణ ఇంతటితో ఆగలేదు.
మస్క్, రాజీవ్‌ల సంవాదం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా దీనిపై స్పందించారు. ‘భారత్‌లో ఈవీఎంలు ‘బ్లాక్ బాక్సులుగా మారాయనీ, వీటిని ఎవరూ పరిశీలించడానికి అనుమతి లేదనీ, దీంతో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై జనంలో అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సంస్థల్లో జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించగా, రాహుల్ ట్వీట్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘ టెక్నాలజీ అనేది ఉన్న సమస్యలను తొలగించాలి తప్ప దానివల్లే కొత్త సమస్యలొస్తే, దానిని వాడకాన్ని నిలిపేయటమే మంచింది. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సాంకేతిక నిపుణులు చెబుతుంటే.. బీజేపీ ఇంకా ఈవీఎంలకే మద్దతు పలకటంలో ఉన్న ఆంతర్యమేమిటో’ అని ఆయన అన్నారు. దీనికి కొనసాగింపుగా, తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం తర్వాత ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు నాయుడూ ఇంతకంటే గట్టిగా ప్రశ్నలు సంధించారు. విచిత్రంగా ఈసారి నాయుడు దీనిపై మౌనం వహిస్తున్నారు. ఏదిఏమైనా, గెలిచినప్పుడు ఒకలా, ఓడితే మరోలా నేతలు ఈవీఎంల గురించి అనుమానాలు లేవనెత్తటం ఓటర్ల మనసులో ఈవీఎంల పనితీరుపై ఉన్న అనుమానాలను మరింత పెంచుతున్నాయి.
Also Read: భవిష్యత్ భారతానికి బలమైన నేత రాహుల్
నేతల వాదనలు కాసేపు పక్కనబెడితే, ఈవీఎం అనేది ఒక అదృశ్య శక్తిగా మారింది. అయితే, దీనిపై ఎన్నికల సంఘం జవాబిస్తూ.. ఈ అనుమానాల నివృత్తికే వీవీ ప్యాట్‌లను ప్రవేశపెట్టామని చెబుతోంది. ఓటరు నొక్కిన గుర్తుకే ఓటు పడిందని వీవీప్యాట్‌లో కనిపిస్తున్న మాట నిజమే. అయితే.. లెక్కింపు సమయంలో కనిపించే సాక్ష్యంగా ఉన్న వీవీ ప్యాట్‌లను పక్కనబెట్టి, కనిపించకుండా ఈవీఎంలో నిక్షిప్తమైన ఓటునే ప్రమాణంగా తీసుకుంటున్నది. ఇదే అన్ని అనుమానాలకు మూలంగా ఉన్న అంశం. 2019 సాధారణ ఎన్నికల్లో 345 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉన్నట్లుగా తేలగా, తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లోనూ 140 పైచిలుకు సీట్లలో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నదని ‘ది వైర్’ వార్తాసంస్థ కథనం చెబుతోంది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ఈ గణాంకాలు ఉండటం విశేషం. అయితే, దీనిపై నేటికీ ఈసీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోతోంది.
మరోవైపు.. ఈవీఎంలలో వాడే చిప్‌ల మీదా అనుమానాలున్నాయి. ఈ పరిజ్ఞానంపై ఈసీ సూటిగా సమాధానం చెప్పటం లేదు. ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని నిపుణులు విసురుతున్న సవాళ్లను పట్టించుకోనట్లే ఈసీ వ్యవహరిస్తోంది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలో బ్లూటూత్ టెక్నాలజీ వంటిది ఉండదు గనుక వాటిని హ్యాక్ చేయలేమని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్‌లు వాడుతున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందనీ ఈసీ అంగీకరించింది. అయితే, ప్రోగ్రామబుల్ చిప్‌లు, ఫ్లాష్ మెమరీని హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నా.. ఈసీ నోరుతెరవటం లేదు. ఇక.. ఈవీఎంలను తయారుచేసే ఈసీఐఎల్ సంస్థ లెక్కల ప్రకారం.. ఎన్నికల సంఘం కోరిన దానికంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కొన్నిచోట్ల ప్రైవేటు వ్యక్తుల వద్ద ఈవీఎంలు దొరకటం కూడా సంచలనం కలిగించింది. దీనిపై ఈసీ స్పందిస్తూ.. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది.
తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు మాత్రమే తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను సిద్ధం చేయగా, వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు చెప్పిన ఈసీ.. మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నలపై మౌనం వహిస్తోంది. ఇవిగాక, ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదనే మాటపైనా ఈసీ మౌనంగానే ఉంటోంది. ఈ అనుమానాల నేపథ్యంలో ఎంతో ఘన చరిత్ర గల భారత ఎన్నికల సంఘం ఇకనైనా ఈ అంశాలపై స్పందించి ఈవీఎంల మీద స్పష్టమైన వివరణ ఇవ్వటంతో బాటు ఈవీఎంల హ్యాకింగ్ ఎలా అసాధ్యమో వివరించేందుకు కసరత్తు చేయాలి. లేకపోతే, ప్రతి ఎన్నిక వేళా.. ఓడిన పార్టీలు ఇదే పాట పాడతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం బలహీన పడటమే గాక నవ్వులపాలవుతుందంటే అతిశయోక్తి కాదు.