Rahul Is A Strong Leader Of Future India: భారతదేశంలోనే ఒక బలమైన కుటుంబం. దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన కుటుంబం. దేశ రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న కుటుంబం. నాలుగో తరం నేతగా, ఐదు పదుల వయసు పైబడిన రాహుల్ గాంధీ భారతదేశ రాజకీయాలలో భవిష్యత్‌లో బలమైన నేతగా ఎదగబోతున్నారని 18వ లోక్ సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తన కుటుంబం నుండే నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం బలైన వారి బాటలోనే రాజకీయ ప్రయాణాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలలో విద్యను అభ్యసించిన రాహుల్ గాంధీ వారసత్వ రాజకీయాలలో ఎదిగి వచ్చిన రాజకీయ నాయకులకు భిన్నంగా కనిపిస్తారనటంలో సందేహం లేదు. రెండు దశాబ్దాల తన రాజకీయ చరిత్రలో ఎన్నో అత్యున్నత పదవులు పొందటానికి అవకాశాలు ఉన్నా, వచ్చినా ఇప్పటివరకు ఏ అధికారిక పదవి చేపట్టకుండా తనని నాన్ సీరియస్ పొలిటీషియన్‌గా చిత్రీకరించి పప్పు అని హేళన చేస్తున్నా నిత్య విద్యార్థిగా తనని తాను మలుచుకుంటూ నేడు దేశంలో, లోక్ సభలో బలమైన ప్రతిపక్షం ఏర్పడటానికి కారణం అయ్యారు. రాహుల్ గాంధీ దేశ రాజకీయాలలో ఒక బలమైన నేతగా ఎదగటానికి వడివడిగా అడుగులు పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం.
దేశ రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన గాంధీ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ, తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూశారు. 2004లో అమేథీ లోక్ సభ స్థానం నుండి గెలుపుతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2019 లోక్ సభ ఎన్నికలలో అమేథీ లోక్ సభ స్థానంలో ఓడినా వయనాడులో గెలిచి ఇప్పటివరకు ఐదు పర్యాయాలు లోక్ సభ సభ్యునిగా గెలుపొందారు. 2007లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా 2015లో జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2017 నుండి 19 వరకు జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కానీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తాను ఎదుర్కొన్న 2019 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 52 లోక్ సభ స్థానాలు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదాని కూడా పొందలేక దారుణమైన ఓటమిని చవిచూసింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న రాహుల్ గాంధీ, తన సారధ్యంలోని వైఫల్యాలని అధిగమించటానికి నాటి నుండి నేటి వరకు పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నా పునర్జీవం కోసం అడుగులు వేశారు.
రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని జోడో యాత్ర మలుపు తిప్పిందనే చెప్పాలి. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన మొదటి విడత జోడో యాత్ర, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగిన రెండో విడత జోడో న్యాయ యాత్ర దేశ సమస్యలను అర్థం చేసుకోవడానికి, ప్రజలు ముఖ్యంగా క్రింది వర్గాల ప్రజల జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి రాహుల్ గాంధీకి ఉపయోగపడింది. కట్టుదిట్టమైన రక్షణ వలయంలో పెరిగిన రాహుల్ గాంధీ మొదటిసారి జోడోయాత్రలతో తనకున్న రక్షణ వలయాన్ని ఛేదించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ యాత్రలు రాహుల్‌ని ఒక కొత్త నాయకుడిగా ఆవిష్కరించిందనటంలో సందేహం లేదు. జోడో యాత్ర తరువాత ఒక కొత్త రాహుల్‌ని చూడబోతున్నారని జైరాం రమేష్ చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చుతున్నట్లుగా కనిపిస్తోంది. జోడో యాత్ర సందర్భంగా దేశ ప్రజలు విద్వేషాలు విడనాడి ఐక్యమత్యంతో జీవించాలని రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం ఆయనలో ఒక పరిణితి చెందుతున్న నాయకుడి లక్షణాలుగా ప్రజలు భావించారు. జోడో యాత్ర తరువాత రాహుల్ గాంధీ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది. అలాగే, 18వ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, మద్దతు ఇచ్చిన కూటమి కూడా లోక్ సభలో పెద్ద ఎత్తున తన బలాన్ని పెంచుకున్నాయి. దీనికి రాహుల్ జోడో యాత్రలు ఎంతగానో దోహదపడ్డాయి.
Also Read: నప్పని పాత్రలో నమో.. మెప్పిస్తారా?
18 వ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు ప్రధాని మోదీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి నుండి జెడీయూ, ఆర్ఎల్డీ లాంటి పార్టీలు బయటకు వెళ్లడం కూటమిలో ఉన్న కొన్ని పార్టీల మధ్య సమన్వయం సాధించలేకపోయినా అధైర్య పడకుండా అన్నీ తానై కాంగ్రెస్ తరపున కూటమిలోని మిత్రపక్షాల తరఫున దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు రాహుల్. దాని ఫలితంగా కూటమికి 232 లోక్ సభ స్థానాలు దక్కింది. ఈ విజయం సాధించడానికి రాహుల్ గాంధీ కృషి మరువలేనిది. ఒకవైపు మోదీ ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని స్థాయిలో మాట్లాడటం లేదనే విమర్శలు వచ్చిన సందర్భంలో మరొక వైపు రాహుల్ గాంధీ ఎక్కడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల కోసం రూపొందించిన న్యాయ పత్ర్‌ని ప్రజలలోకి తీసుకుపోవటంలో, కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేయబోతుందో చెప్పటంలో, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనే విషయాల్ని ప్రజల్లోకి తీసుకుపోవటంలో రాహుల్ సఫలీకృతం అయ్యారు. కాబట్టే కూటమి మెరుగైన ఫలితాలు రాబట్టగలిగింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలు, రైతు సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాహుల్ గాంధీ విజయవంతమయ్యారు. మరీ ముఖ్యంగా తన ప్రచారంలో మోదీని వ్యక్తిగతంగా విమర్శించకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇది రాహుల్ పరిణితి చెందిన నాయకత్వానికి అద్దం పడుతోంది.
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేసి క్వార్టర్‌ని ఖాళీ చేయించిన సందర్భంలో నిబ్బరంగా వ్యవహరించిన తీరు, ధైర్యంగా స్పందించిన తీరు ప్రజలలో సానుభూతిని మాత్రమే కాదు ఆయన ఇమేజ్‌ని కూడా పెంచిందనే చెప్పాలి. 18వ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ గ్రాఫ్ తగ్గుతుంటే (గత లోక్ సభ ఎన్నికలలో వారణాసి నుండి పోటీ చేసిన మోడీ నాలుగు లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధిస్తే ఈసారి అదే వారణాసి నుండి మోడీ కేవలం 1,50,000 పై చిలుకు ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు) రాహుల్ గాంధీ గ్రాఫ్ మాత్రం పెరుగుతుందనే చెప్పాలి (రాయబరేలి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సాధించిన 3 లక్షల 88 వేల పైచిలుకు మెజార్టీనే ఉదాహరణ). దశాబ్ద కాలంగా దేశంలో మోదీ ఒక బలమైన నేతగా ఎదిగారు. గత కొంత కాలంగా మోదీ తరువాత ఎవరు అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయంగా కనిపించలేకపోయారు కానీ లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలో మోదీ తరువాత రాహుల్ గాంధీనే ప్రధానిగా ఎక్కువ శాతం ప్రజలు కోరుకుంటున్నారు అనేది వాస్తవం. భవిష్యత్తులో మోదీకి దీటుగా రాహుల్ గాంధీ ఎదగబోతున్నారని ప్రజల నుండి వినిపిస్తున్న మాట. కూటమిలోని అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ సోరేన్, సుప్రియ, ఆదిత్య థాక్రే, అభిషేక్ బెనర్జీ లాంటి వారితో రాహుల్ గాంధీకి సత్సంబంధాలు ఉండటం లోక్ సభలో ఒక బలమైన ప్రతిపక్షానికి నాయకత్వం వహించే అవకాశం రాబోతుండటం కచ్చితంగా రాహుల్ బలమైన నేతగా ఎదగటానికి దారులు పడుతున్నట్లుగానే కనిపిస్తోంది. మోదీ 3.0 ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలు ఊపిరిలూదాయి. కానీ, మహారాష్ట్ర, బిహార్ శాసనసభకి 2025లో జరిగే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే రాహుల్ ఇమేజ్ మరింత పెరగడమే కాదు మోదీ ప్రభుత్వ సుస్థిరత ప్రశ్నార్ధకమయ్యే అవకాశాలు లేకపోలేదు. 18వ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమిని రాహుల్ గెలిపించలేకపోయినా మెరుగైన ఫలితాలు సాధించడంలో కీలక భూమిక పోషించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి భవిష్యత్తు విజయానికి బాటలు వేశారు. బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం, కూటమిని సమన్వయంతో ముందుకు నడిపించే విధంగా చూడటం, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం రాహుల్ గాంధీ ముందున్న అతిపెద్ద సవాళ్లు. ఈ సవాళ్లను అధిగమిస్తే రానున్న రోజుల్లో రాహుల్‌కు తిరుగుండదు.
-డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం