Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బస్సు డ్రైవర్.. ఎదురుగా వెళ్తోన్న బైక్ ను ఢీకొట్టడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అంతా భావించారు. అయితే ఘటనాస్థలిని పరిశీలించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (Vikrant Patil).. కీలక వ్యాఖ్యలు చేశారు. బైక్ ను బస్సు అసలు ఢీకొట్టలేదని ఆయన పేర్కొన్నారు.
ఎస్పీ ఏమన్నారంటే?
బస్సు ఘటనాస్థలికి వచ్చేసరికే రోడ్డుపై బైక్ పడి ఉందని కర్నూల్ ఎస్పీ తెలిపారు. డ్రైవర్ బైక్ ను చూడకుండా ముందుకు పోనివ్వడం వల్లే బస్సు కింద అది ఇరుక్కుపోయిందని చెప్పారు. రోడ్డుకు బైక్ కు మధ్య ఘర్షణ తలెత్తి నిప్పురవ్వలు చెలరేగాయని చెప్పారు. బస్సును డ్రైవర్ ఆపగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. చూస్తుండగానే బస్సు పూర్తిగా తగలబడిపోయిందని అన్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ వివరాలను వెల్లడించారు.
బైక్ రోడ్డుపై ఎలా పడింది?
అయితే ప్రమాదానికి కారణమైన బైక్ ను ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేదా సెల్ఫ్ యాక్సిడెంటా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు వరకూ బస్సు డ్రైవర్ బైక్ ను ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంతా భావించారు. బైకర్ ను ఢీకొట్టగానే అతడు ప్రాణాలు విడిచాడని.. దాంతో భయంతో డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడని.. ఆ సమయంలో బైక్ బస్సు కింద ఇరుక్కుపోయిందని ప్రచారం జరిగింది. 300 మీటర్ల పాటు బస్సును ఈడ్చుకెళ్లడం వల్లే మంటలు చెలరేగి బస్సు తగలబడిందని వార్తలు వచ్చాయి. కానీ పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్.. బైక్ ముందే రోడ్డుపైన పడి ఉందని చెప్పడంతో అంతా షాకయ్యారు. అయితే ఏది నిజం అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Also Read: Maharashtra: ఎస్ఐ 4 సార్లు అత్యాచారం చేశాడు.. శారీరకంగా వేధించాడంటూ.. యువ వైద్యురాలు సూసైడ్
హోంమంత్రి ఏం చెప్పారంటే?
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదానికి సంబంధించి హోంమంత్రి అనిత (Home Minister Anitha) మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో 19మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మృతుల్లో 17 మంది పెద్దవాళ్లు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో ఆరుగురు ఏపీకి చెందిన వారు ఉన్నారని హోంమంత్రి స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేశామని.. గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహాలు ఉన్నాయని చెప్పారు. దీంతో బాడీలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మెుత్తం 16 టీమ్ లు రంగంలోకి దిగాయని.. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని అనిత చెప్పారు.

