Kurnool Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఏ ప్రమాదం జరిగినా.. కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తాయి. తాజాగా జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Vemuri Kaveri Travels Bus) విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన బస్సు.. స్లీపర్ అయినందువల్లే ఎక్కువ ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్ఘటనకు కారణం ప్రమాదమా? లేదా నిర్లక్ష్యమా? అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఎమర్జెన్సీ డోర్..
సాధారణంగా ప్రతీ బస్సులోనూ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్స్ సమయంలో బస్సులోని ప్రయాణికులు వేగంగా బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. చాలా వరకూ ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడ్డవారంతా ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చిన వారే. అయితే స్లీపల్ బస్సుల్లోనూ ఓ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే.. బస్సు మెుత్తం బెర్తులతో ఇరుకుగా ఉండటమే. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కింద బెర్త్ లో ప్రయాణించేవారు వేగంగా ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వచ్చేందుకు వీలు ఉంటుంది. కానీ పైన బెర్త్ లో ఉన్న వారు కిందకు దూకి మరి ఎమర్జెన్సీ డోర్ వద్దకు చేరుకోవడం ఎంతో క్లిష్టంగా మారుతుంది. 6 అడుగుల ఎత్తు వరకూ ఉన్న బెర్త్ నుంచి కిందకి దూకే క్రమంలో కాళ్లు, చేతులు విరిగే ప్రమాదం లేకపోలేదు. దానిని తట్టుకొని ఎమర్జెన్సీ డోర్ వద్దకు చేరుకోవడమనేది బయటపడే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది.
బస్సు ఇరుకుగా ఉండటం..
సాధారణ సీటింగ్ బస్సుల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. ఒక సీటు నుంచి మరో సీటుకు దూకుతూ బయటపడేందుకు వీలు ఉంటుంది. కానీ స్లీపర్ బస్సుల్లో అలా ఉండదు. బస్సు మెుత్తాన్ని స్లీపర్ బెర్తుల కోసం బ్లాకులుగా విభజించడం వల్ల ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు ఒకటే మార్గం ఉంటుంది. అది కూడా ఇరుకుగా ఉండే మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అప్పర్ బెర్తులు, లోయర్ బెర్తుల వారు ఒకేసారి తప్పించుకోవడం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. సీటింగ్ బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్.. చివరి నుంచి రెండు, మూడో సీటు వరుసలో ఉంటుంది. కానీ స్లీపర్ కు వచ్చేసరికి చాలా బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్ ను మెుక్కుబడిగా చివరన ఏర్పాటు చేస్తుంటారు. దీని వల్ల అందరూ చివరి వైపునకు పరిగెత్తాల్సి రావడం వల్ల లోపల తొక్కిసలాట జరిగే అవకాశం లేకపోలేదు.
గైడ్ లైన్స్ లేకపోవడం
విమానం ఎక్కినప్పుడు ప్రయాణికులకు ముందుగా కొన్ని భద్రతాపరమైన గైడ్ లైన్స్ ను ఫ్లైట్ సిబ్బంది సూచిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా బయటపడాలి? తమను తాము ఎలా కాపాడుకోవాలి? వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. కానీ నిత్యం వేలాది మంది ప్రయాణించే బస్సుల విషయంలో మాత్రం అలాంటి చర్యలేవి కనిపించవు. ప్రమాద రిస్క్ ఎక్కువగా ఉండే స్లీపర్, ఏసీ స్లీపర్ బస్సుల్లోనైనా విమానం తరహాలో భద్రతాపరమైన సూచనలు చేస్తే అగ్నిప్రమాదాల సమయంలో భారీ ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్లీపర్ బస్సుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉంటారు. అటువంటి సందర్భాల్లో ప్రమాదం జరిగితే ఏం చేయాలో వారికి అవగాహన కల్పించాలి. బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది? అద్దాన్ని బద్దలు కొట్టే హామర్ ఏ కిటికీ వద్ద ఏర్పాటు చేశారు? ముందే సూచిస్తే ప్రయాణికులు క్షేమంగా బయటపడేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.
Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో తీరని విషాదం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృత్యువాత
డ్రైవింగ్ సమయం ఆదా కోసం..
ఆర్టీసీతో పోలిస్తే ప్రైవేటు బస్సుల్లోనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. నగరాల్లో వీలైనన్నీ ఎక్కువ స్టాప్స్ ను కవర్ చేస్తూ ప్రైవేటు బస్సులు ప్రయాణిస్తుంటాయి. దీని వల్ల సిటీ ఔట్ కట్స్ కు చేరుకునే సరికి.. ప్రయాణ సమయం దాదాపు కుచించుకుపోతుంది. ఈ క్రమంలో ఆ సమయాన్ని భర్తీ చేసేందుకు ప్రైవేటు బస్సు డ్రైవర్స్.. అతివేగంగా బస్సును నడపడటాన్ని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా జరిగిన కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలోనూ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అర్ధమవుతుంది. బస్సు హైదరాబాద్ నుంచి ఆలస్యంగా బెంగళూరు బయలుదేరడంతో బస్సు డ్రైవర్ స్పీడ్ పెంచాడు. దీంతో కర్నూలు శివారుకు చేరుకోగానే ఎదురుగా వెళ్తోన్న బస్సును ఢీకొట్టాడు. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఊహించని ప్రాణనష్టం సంభవించింది.
బైక్ను ఢీ కొనడంతో బస్సులో చెలరేగిన మంటలు
మంటల్లో చిక్కుకుని దాదాపు 20 మంది మృతి..!
బస్సు ఆక్సిడెంట్ గ్రాఫిక్స్ (AI Video) https://t.co/bek7xZYDLW pic.twitter.com/jfB8zJVoty
— ChotaNews App (@ChotaNewsApp) October 24, 2025

