Kartika Masam: మన హిందూ సంప్రదాయాలలో కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న నెలగా భావిస్తారు. శివునికి ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. కార్తీక మాసంలో భక్తులు ప్రత్యేక ఆచారాలను పాటిస్తూ, శివుని ఆరాధనలో మునిగిపోతారు. ఈ నెలలో ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం, శాంతి నెలకొనాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ నెల యొక్క ప్రాముఖ్యత, ఎలాంటి ఆచారాలను పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం
కార్తీక మాస ఆచారాలు
మాంసాహార నిషేధం
కార్తీక మాసంలో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధిస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాలను ఆ నెలంతా కూడా తినరు. ఈ నెలలో కేవలం సాత్విక ఆహారం, అంటే కూరగాయలతో వండిన వంటకాలు మాత్రమే తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి చెందడమే కాక, శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది.
శివుని ఆరాధన, ఉపవాసం
ఈ మాసం శివుడికి ప్రీతికరమైనది కాబట్టి, స్త్రీలు, పురుషులు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం లేదా శనివారం రోజున ఉపవాసం ఉండటం శివభక్తిని చాటుతుంది. శివాలయంలో పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించడం ద్వారా శివుని ఆశీస్సులు పొందవచ్చు. ఇది మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది.
Also Read: Slap Your Coworker Day: మీ తోటి ఉద్యోగి చెంప చెళ్లుమనిపించాలా? ఇదే సరైన రోజు.. ఎందుకంటే?
దీపారాధన – ఆధ్యాత్మిక శోభ
కార్తీక మాసంలో సాయంత్రం వేళల్లో దీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైన ఆచారం. ఇంట్లో దేవుని ముందు, గుమ్మం వద్ద, తులసి చెట్టు ముందు దీపాలను వెలిగించాలి. చీకటి పడకముందే ఈ దీపాలను వెలిగించి, దేవునికి దండం పెట్టడం వలన సానుకూల శక్తి ఇంట్లో నిండుతుంది.
పవిత్ర స్నానం
కార్తీక మాసంలో చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. వీలైతే, పవిత్ర నదులు లేదా సరస్సులలో స్నానం చేస్తే అపార పుణ్యం లభిస్తుంది. వీలు కాకపోతే, ఇంట్లోనే చల్లని నీటితో స్నానం చేయాలి.
మానసిక శాంతి, ప్రేమ
కార్తీక మాసంలో నిర్మలమైన మనసుతో, శాంతియుతంగా ఉండటం చాలా ముఖ్యం. గొడవలు, తగాదాలు, కోపానికి దూరంగా ఉండాలి. అందరినీ సొంత వారిలా భావించి, ప్రేమతో, సంతోషంగా వ్యవహరించాలి. చెడు మాటలు మాట్లాడకుండా, సాత్విక ఆలోచనలతో ఉండటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది.
