Jaish e Mohammed: భారత్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఐక్యరాజ్యసమితి ఉగ్రసంస్థగా గుర్తించినా దాయాది దేశం పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘జైషే మొహమ్మద్ (Jaish e Mohammed JeM) బుద్ధి మారడం లేదు. మసూద్ అజర్ నాయకత్వంలో పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ ముష్కర సంస్థ తాజాగా మహిళలకు కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జమాత్ ఉల్-ముమినాత్ (Jamat ul-Muminat) పేరిట ప్రత్యేక యూనిట్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇదివరకే సమాచారం బయటకు వచ్చినప్పటికీ, తాజాగా కొన్ని పత్రాలు సైతం బయటపడ్డాయి.
Read Also- YS Jagan Trolled: ఏంటీ?.. వైఎస్ జగన్ లేడీస్ షూస్ వేసుకుంటున్నారా?.. నిజమెంత?, వాటి రేటు ఎంత?
‘తుఫత్ అల్-ముమినాత్ (Tufat al-Muminat) అనే ఆన్‌లైన్ శిక్షణా కోర్సును మొదలుపెట్టింది. దీని ద్వారా నిధుల సేకరణ, రిక్రూట్‌మెంట్లు చేపడుతోంది. మసూద్ అజార్ చిన్న చెల్లెలు సాదియా అజార్‌కు ఈ మహిళా విభాగం బాధ్యతలు అప్పగించారు. అంటే, మహిళా ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఆమే చూసుకుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాదియా భర్త యూసుఫ్ అజార్, మే నెలలో బహవల్‌పూర్‌లోని జైష్ ప్రధాన కార్యాలయంపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడిలో చనిపోయాడు.
మొత్తం ఆన్‌లైన్‌లోనే
ఇక, మహిళా ఉగ్రవాదులకు అందించే కోర్సును అజార్ ఇద్దరు సోదరీమణు సాదియా అజార్, సమీరా అజార్ బోధించి, ట్రైనింగ్ ఇస్తారు. రోజుకు 40 నిమిషాలపాటు క్లాసులు తీసుకుంటారు. ఈ తరగతుల ద్వారా మహిళలను జమాత్ ఉల్-ముమినాత్‌లో చేరేలా ప్రోత్సహిస్తారు. తరగతులు చెప్పడంలో జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కుటుంబంలోని మహిళలు, అతడి కమాండర్లు, బంధువులు తరగతులు తీసుకుంటారు. జిహాద్, ఇస్లాంకు సంబంధించి మహిళల కర్తవ్యాల పేరిట బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇక, ఈ కోర్సులో చేరే ప్రతి మహిళ నుంచి 500 పాకిస్థానీ రూపాయలు వసూలు చేస్తారు. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.156 వరకు ఉంటుంది. కోర్స్ మొత్తం ఆన్‌లైనే ఉంటుందని సదరు ప్రచార పత్రంలో జైషే మొహమ్మద్ గ్రూప్ పేర్కొంది. ఈ వివరాలన్నీ బయటపడిన ఆ ప్రచార పత్రాల ద్వారానే వెల్లడయ్యాయి.
Read Also- Chhattisgarh: హిడ్మా సరెండర్ కాబోతున్నాడా? ఏటూరు నాగారం, తుపాకులగూడెం అడవుల్లో సంచరిస్తున్నాడా?
పాకిస్థాన్‌లో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడం పద్ధతి కాదనే నిబంధన ఉండడం, సామాజిక నిబంధనల నేపథ్యంలో ఆన్‌లైన్ పద్ధతిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో మహిళా ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నవంబర్ 8న ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మహిళలను ఈ గ్రూపులోకి చేర్చేందుకు అక్టోబర్ 19న ‘దుఖ్తరాన్-ఏ-ఇస్లాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రచారపత్రం వెలుగులోకి వచ్చింది. దీనిని బట్టి పాకిస్థాన్‌లో ఎంత యథేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) నిబంధనలు అమలు చేస్తున్నామంటూ పాకిస్థాన్ పదేపదే బాహ్య ప్రపంచాన్ని నమ్మిస్తున్నప్పటికీ, అక్కడ జరిగే చర్యలు మాత్రం వేరని అర్థమవుతూనే ఉంది.
