Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్ధతు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ ను కోరారు. ఈమేరకు పీసీసీ చీఫ్ ప్రత్యేక లేఖ రాశారు. ఇప్పటికే ఎంఐఎం, సీపీఎం, సీపీఐలు సపోర్టు చేశాయని వెల్లడించారు. ఉప ఎన్నికల అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయానికి దోహదపడాలని కోరారు. గత పదేళ్ల పాలన, 22 కాంగ్రెస్ పాలనపై ప్రజల స్పందన ఓ పార్టీ అధ్యక్షుడిగా పసిగట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలు క్షేమంగా, సంతోషంగా ఉన్నాయని వివరించారు. అందుకే మద్ధతు ఇవ్వాలని కోరారు.
కేటీఆర్ కుటుంబ అవినీతి చరిత్ర
ఇక ఏఐసీసీపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు టీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసిన ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ’వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ముందుగా తమ కుటుంబ అవినీతి చరిత్రను ఆకళింపు చేసిన తర్వాతనే నీతులు చెప్పాలని నొక్కిచెప్పారు. కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడటం అంటే నక్క నిజాయితీ గురించి బోధించడం లాంటిదేనని పీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు.
ప్రతి అవినీతి దోపిడీ వెనుక కేసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం
కల్వకుంట్ల కుటుంబానికి అవినీతికి అవినాభావ సంబంధం అనేది పుట్టుకతో ఉన్న బంధం అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన, అవినీతి ప్రాజెక్టుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఫార్ములా–ఈ, మద్యం, భూస్కాంల వరకు ప్రతి అవినీతి దోపిడీ వెనుక కేసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని పీసీసీ చీఫ్ తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ సోదరి కవిత స్వయంగా గతంలో తండ్రి గా కేసీఆర్ పడ్డ కష్టాలు గురించి వివరించారని గుర్తు చేశారు. వేల కోట్లకు ఎలా ఎదిగారు? అంటూ ప్రశ్నించారు. దళిత నాయకుడు నడిపిస్తున్న పార్టీని విమర్శించడం సిగ్గుచేటని పీసీసీ చీఫ్ మండిపడ్డారు. ఇక బీఆర్ ఎస్ అంటే భ్రష్టాచార రక్షణ సమితి అంటూ విమర్శించారు.
Also Read: Mahesh Kumar Goud: బండి సంజయ్ బీసీ కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
