Toll Gates Opened: దీపావళి హిందువులకు చాలా పెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, గిఫ్ట్‌లు అందజేస్తుంటాయి. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు, వారి కృషిని గుర్తించే క్రమంలో కంపెనీలు ఈ తరహా ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలైతే లక్షల రూపాయల బోనస్‌లతో పాటు, గోల్డ్ కాయిన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు స్విట్ బాక్సులు, క్రాకర్స్ బహుమతిగా ఇస్తుంటాయి. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులను పెద్దగా మెప్పించే పనిచేయవు. అలాంటి సందర్భాల్లో ఉద్యోగులకు నిరుత్సాహానికి, అసంతృప్తికి గురవ్వడం ఖాయం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది.
దీపావళి బోనస్‌గా కేవలం రూ.1,100 మాత్రమే చెల్లించడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేబాద్‌లో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న టోల్ గేట్ సిబ్బంది తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తమ అసంతృప్తిని, నిరసనను తెలియజేసేందుకు దీపావళి పండుగ అయిన సోమవారం నాడు ఏకంగా టోల్‌గేట్లు పూర్తిగా పైకెత్తి, వాహనాలను ఉచితంగా అనుమతించారు. దీంతో, వేలాది వాహనాలు టోల్ ఛార్జీలు చెల్లించకుండానే టోల్ గేట్ దాటి వెళ్లాయి. దీపావళి బోనస్‌పై ఉద్యోగుల అసంతృప్తి ఇందుకు కారణమైంది. ఉద్యోగుల తెలిపిన ఈ నిరసన కారణంగా టోల్ కార్యకలాపాలతో పాటు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకోవాల్సి వచ్చింది.
‘శ్రీ సైన్ అండ్ దతార్’ అనే కంపెనీ ఫతేహాబాద్ టోల్ ప్లాజాను నిర్వహిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ టోల్ వద్ద మొత్తం 21 మంది ఉద్యోగులం పనిచేస్తున్నామని, దీపావళి బోనస్‌గా కేవలం రూ. 1,100 మాత్రమే రావడం తమ అసంతృప్తికి కారణమని వివరించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కంపెనీ ఈ ఏడాది మార్చిలోనే టోల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. దీంతో, పండుగ బోనస్ లెక్కింపు, పంపిణీకి అనుసరించిన విధానం చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారింది. తమకు మరింత ఎక్కువ బోనస్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అందరూ కలిసి తమ విధులను సమిష్టిగా ఆపివేశారు. దీంతో, వాహనాలు టోల్ చార్జీలు చెల్లించకుండా, ఎలాంటి తనిఖీ లేకుండానే ముందుకు వెళ్లిపోయాయి.
Read Also- H1B Visa Fee: హెచ్-1బీ వీసా ఫీజు విషయంలో ట్రంప్ సర్కార్ ఊహించని గుడ్‌న్యూస్!
కంపెనీ ప్రయత్నాలకు సైతం అడ్డగింపు
టోల్ చెల్లించకుండానే వేలాది వాహనాలు వెళ్లిపోవడంపై టోల్ గేట్ నిర్వహణ కంపెనీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర టోల్ ప్లాజాల నుంచి సిబ్బందిని రప్పించి, కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, నిరసన తెలుపుతున్న ఉద్యోగులు ఆ కొత్త సిబ్బందిని కూడా పనిచేయకుండా అడ్డుకున్నారు. దీంతో, మరింత అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది వెంటనే టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని కంట్రోల్‌లోకి తీసుకొచ్చారు. కంపెనీ అధికారులు, ఆందోళన చేస్తున్న ఉద్యోగుల మధ్య చర్చలకు పోలీసు అధికారులు చొరవ చూపారు. ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించేందుకు చర్చల్లో కంపెనీ అధికారులు అంగీకరించారు. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, తక్షణ పరిష్కారంగా జీతాన్ని 10 శాతం మేర పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో, ఉద్యోగులు తిరిగి సేవలు పున:ప్రారంభించారు. మొత్తానికి 2 గంటల అంతరాయం తర్వాత అక్కడి టోల్‌గేట్ సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే, ఉద్యోగులకు తక్కువ బోనస్ అందించిన నిర్ణయంపై శ్రీ సైన్ అండ్ దతార్ కంపెనీ స్పందిస్తూ… తాము మార్చి నెలలోనే కాంట్రాక్టు తీసుకున్నామని తెలిపింది. పూర్తిగా ఒక సంవత్సరం కూడా గడవక ముందే బోనస్‌ను అందించలేమంటూ నిర్ణయాన్ని సమర్థించుకుంది.
