H1B Visa Fee: హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజును (H1B Visa Fee) ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ గత నెలలో అమెరికా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింద. ఈ విధానంపై తాజాగా సంపూర్ణ స్పష్టత వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తూ యూఎస్‌సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) కీలక విషయాన్ని వెల్లడించింది. అమెరికాలో ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు హెచ్-1బీ స్టేటస్ కోసం స్పాన్సర్ చేస్తే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు పెంచిన ఫీజుపై సంపూర్ణ స్పష్టత ఇస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం సోమవారం (అక్టోబర్ 20) నాడు మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబర్ నెలలో హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతున్నట్టుగా ప్రకటన చేసిన నాటి నుంచి, తమకు ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఏజెన్సీలు విఫలమవుతున్నాయి. మరోవైపు, ఉద్యోగులు, వీసా హోల్డర్లలోనూ గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ప్రభుత్వం తాజా ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ విద్యార్థులకు ఫీజు వర్తించదంటూ స్పష్టత రావడం, అక్కడ పెద్ద సంఖ్యలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు గొప్ప ఉపశమనం కలిగించే పరిణామం.
Read Also- Riyaz Encounter: రియాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత.. కానిస్టేబుల్ భార్య ఎం చెప్పారో తెలుసా..!
ట్రంప్ టీమ్ ఏం చెప్పిందంటే..
యూఎస్‌సీఐఎస్ అక్టోబర్ 20న విడుదల చేసిన మార్గదర్శకాల్లో పలు విషయాలను స్పష్టంగా వివరించింది. అమెరికాను వదిలి వెళ్లకుండానే, ఒక కేటగిగి నుంచి మరో కేటగిరిలోకి మారేవారికి, అంటే ‘స్టేటస్ మార్పు’ (Change of status) విషయంలో లక్ష డాలర్ల ఫీజు వర్తించబోదని స్పష్టం చేసింది. ఉదాహరణకు, ఎఫ్-1 వీసాపై చదువుకుంటున్న విద్యార్థి, ఆ స్టేటస్ నుంచి హెచ్-1బీ స్టేటస్‌కు మారితే ఫీజు వర్తించదు. అయితే, అమెరికా వెలుపలి దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఫీజు పెంపు నిర్ణయం తీసుకునేలోపే అమెరికా విడిచి వెళ్లాల్సిన వారికి మాత్రం వర్తించబోదని ఏజెన్సీ క్లారిటీగా వివరించింది. హెచ్-1బీ వీసా హోల్డర్లు అమెరికా నుంచి బయటకు వెళ్లేందుకు, తిరిగి ప్రవేశించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని, ఎవరూ ఆపబోదరని తెలిపింది.
Read Also- TG Weather Update: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు
డెడ్‌లైన్ సెప్టెంబర్ 21.. సమయం 12.01 గంటలు
కొత్త ఫీజు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో నిర్దిష్ట సమయాన్ని కూడా యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. 2025 సెప్టెంబర్ 21న సమయం 12:01 గంటలు (అర్ధరాత్రి), లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న కొత్త హెచ్-1బీ అప్లికేషన్లకు పెంచిన ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికా వెలుపల ఉన్నవారికి, చెల్లుబాటు కాని హెచ్-1బీ వీసా ఉన్నవారికి ఫీజు పెంపు ప్రకటన వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. మరోవైపు, లక్ష డాలర్ల ఫీజు చెల్లింపు కోసం ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కొత్త ఫీజు నుంచి ఇతరులు ఎవరికీ మినహాయింపు ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించలేదు. కానీ, అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే, ఆ ఉద్యోగాల్లో పనిచేసేందుకు అమెరికన్లు అందుబాటులో లేకుంటే, ఆ సందర్భాల్లో కంపెనీ యజమానులకు మినహాయింపులు లభిస్తాయని తెలిపింది. అలాంటి సందర్భంలో ఫీజు మినహాయింపు కోరుతూ అప్లికేషన్ పెట్టుకోవచ్చని తెలిపింది.
