Telangana BJP: తెలంగాణ బీజేపీలో నిన్న మొన్నటి వరకు పార్టీలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులకు మధ్య పొసగక సమస్య వివాదాస్పదంగా మారితే.. నేడు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియపైనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియపై సరికొత్త వివాదం రాజుకున్నది. ఇది ఎన్నిక కాదని, కేవలం ఎంపిక మాత్రమేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రస్తుతం పదవిలో ఉన్న కొందరు జిల్లా అధ్యక్షులు అసలు ఎన్నికలకు నామినేషన్ కూడా దాఖలు చేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన సిద్దిపేట(Siddipet) జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్(Byri Shankar Mudiraj), జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు(Rachakonda Yadagiri Babu)లు అసలు ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది.
రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పి
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెబుతున్న పార్టీ నాయకత్వం.. నామినేషన్ కూడా వేయనివారిని ఎలా అధ్యక్షులుగా నియమించిందనే ప్రశ్నలు శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. ఈ జాబితాలో మరిన్ని జిల్లాలు ఉన్నాయా అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. జిల్లా అధ్యక్షుల నియామకం నాటి నుంచి పాత, కొత్త సమస్యలు, సమన్వయ లోపాలు వంటి అంశాలతో రాష్ట్ర నాయకత్వం సతమతమవుతోంది. తాజాగా ఈ నామినేషన్ వివాదం వారికి మరింత తలనొప్పిగా మారింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడి ఇష్యూపై ఇటీవలే తెరపడింది. పార్టీ చర్యలు తీసుకోకముందే కొప్పు రాజశేఖర్ రెడ్డి స్వయంగా రాజీనామా చేయడం గమనార్హం.
Also Read: Gopi Galla Goa Trip Trailer: గోవాలో ఏది బడితే అది చేయవచ్చంట.. ఈ ట్రైలర్ ఏందిరా బాబు ఇలా ఉంది?
క్రమశిక్షణ చర్యల దిశగా..
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) జిల్లాల పర్యటనల సమయంలోనూ పలువురు నేతలు బాహాబాహీకి దిగడంతో.. పెద్దపల్లి జిల్లా నేతలకు క్రమశిక్షణ కమిటీ ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్(Gomasa Srinivas) దీనిపై వివరణ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట, జగిత్యాల జిల్లా అధ్యక్షులపై పార్టీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాదిరిగా వీరిపై కూడా స్వచ్ఛంద రాజీనామాకు ఒత్తిడి పెంచుతారా? లేక పదవిలో కొనసాగిస్తారా? లేదా తొలగిస్తారా? అనేది చూడాలి. ఈ పంచాయితీకి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా కనిపించడంలేదు.
