GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో డైలీ ఉత్పత్తి అవుతున్న చెత్తను శివారులోని డంపింగ్ యార్డుకు తరలించేందుకు మరో 200 కొత్త వాహానాలను సమకూర్చుకోవాలని జీహెచ్ఎంసీ(GHMC) నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలో రోజురోజుకి పట్టణీకరణ వేగంగా పెరుగుతుండటంతో పాటు నివాసాలు, వ్యాపార సంస్థలు సైతం గణనీయంగా పెరుగుతున్న కొద్దీ చెత్త ఉత్పత్తి కూడా పెరుగుతుండగా, డైలీ పోగవుతున్న చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించేందుకు అవసరమైన సంఖ్యలో వాహానాలు లేనట్టు అధికారులు గుర్తించారు. సిటీ(City)లో సాధారణ రోజుల్లో రోజుకి సుమారు 5 వేల నుంచి 6 వేల చెత్త ఉత్పత్తి అవుతుండగా, బక్రీద్, వినాయక నిమజ్జనం వంటి పండుగల సందర్భంలో రెండింతలు చెత్త ఉత్పత్తి అవుతుండటంతో దాన్ని సేకరించి, తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రైవేటు వాహానాలను ఎంగేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇపుడు జీహెచ్ఎంసీ సొంత వాహానాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఫలితంగా చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలు అధికారులు ఆశించినంత వేగంగా జరగటం లేదు.
కలెక్షన్ పాయింట్ల ఏర్పాటు
ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ జరగాలంటే మరో 200 కొత్త వాహానాలను సమకూర్చుకునే అవసరముందంటూ వాహానాల సంఖ్య, వాటి వినియోగం వంటి వివరాలతో ఇది వరకే సర్కారుకు జీహెచ్ఎంసీ డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ను పంపింది. ప్రస్తుతం ఆ డీపీఆర్ సర్కారు పరిశీలలో ఉన్నట్లు, సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జీహెచ్ఎంసీ కొత్త వాహానాలను సమకూర్చుకునేందుకు సిద్దంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం సెకండరీ చెత్త కలెక్షన్ పాయింట్లు 42 ఉండగా, అదనంగా మరో 18 పాయింట్లను ఏర్పాటు చేసి, మొత్తం 60 సెకండరీ గ్యార్బేజీ కలెక్షన్ పాయింట్ల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను కూడా సిద్దం చేశారు.
ఇందుకు గాను ప్రస్తుతం శానిటేషన్ విభాగానికి ఉన్న ముగ్గురు జాయింట్ కమిషనర్లు, 30 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో కలిసి సెకండరీ గ్యార్బేజీ కలెక్షన్ పాయింట్ల ఏర్పాటుకు స్థలాలను కూడా గుర్తించి సిద్దంగా ఉంచారు. ఈ పాయింట్ల ఏర్పాటు పూర్తయి, కొత్త వాహానాలు సమకూరితే చెత్త తరలింపును వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త వాహానాల కొనుగోలుకు సర్కారు అనుమతి రాగానే చకాచకా పాయింట్ల ఏర్పాటు పనులు చేపట్టేందుకు అధికారులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Bandi kaladhar: ఈటలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి లీగల్ నోటీసులు
ఉన్న వాహానాల్లో ఎక్కువ కాలం చెల్లినవే..
ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 270 హేవీ చెత్త వెహికల్స్ ఉండగా, మరి కొన్ని చిన్నా, చితక, తక్కువ సామర్థ్యం కల్గిన వాహానాలతో కలిపి మొత్తం 340 వాహానాలున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఎక్కువ వాహానాలు 15 ఏళ్లు దాటినవే ఉన్నట్లు సమాచారం. ఆర్టీఏ రూల్స్ ప్రకారం 15 ఏళ్లు దాటిన చెత్త వాహానాలను చెత్త తరలింపునకు వినియోగించవద్దన్న నిబంధన ఉంది. గతంలో జీహెచ్ఎంసీ వద్ద చెత్త తరలింపునకు వినియోగించే వాహానాలు సుమారు 600 పై చిలుకు ఉండేవి. వీటిలో చాలా వాహానాలు కాలం చెల్లటంతో గత 2016. 2017 మధ్య అవసరమైన వాహానాలకు ఆర్టీసి ద్వారా మరమ్మతులు చేయించటంతో పాటు 15 ఏళ్లు దాటిన వాహానాలను ఖండం చేస్తూ ఉండటంతో ప్రస్తుతం వాహానాల సంఖ్య 340కి పడిపోయింది.
వీటిలో కాలం చెల్లిన వాహానాలెక్కువగా ఉన్నా, గత్యంతరం లేక జీహెచ్ఎంస డొక్కు వాహానాలతోనే చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియను నిర్వహిస్తుంది. సిటీలో చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను రాంకీ ఎన్విరో సంస్థకు 2012లోనే అప్పగించినా, ఆ సంస్థ అధికారులు ఆశించిన స్థాయిలో పని చేయటం లేదని సమాచారం. సిటీలోని వివిధ ప్రాంతాల్లో సకాలంలో వ్యర్థాలను, చెత్తను సేకరించటం లేదన్న విషయాన్ని నిర్థారించిన కమిషనర్ ఆర్.వి.కర్ణన్ శుక్రవారం నోటీసు కూడా జారీ చేశారు. ప్రస్తుతం రాంకీ ఒప్పందం ప్రకారం రాంకీ సంస్థతో పాటు జీహెచ్ఎంసీ కూడా చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది. ఒక వేళ కొత్త వాహానాల కొనుగోలుకు సర్కారు అనుమతిస్తే ఆ వాహానాలకు ఔట్ సోర్స్ డ్రైవర్లను నియమించి, చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.
Also Read: Jubilee Hills Bypoll: గులాబీకి ‘సర్వే’ ఫియర్!.. ఎందుకీ భయం?
