Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills Bypoll) కాస్త ఆలస్యంగా అయినా కాషాయ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. క్రమంగా ప్రచారం సైతం షురూ చేసింది. ఈ బైపోల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కాస్త దూకుడుగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ తరుపున హైదరాబాద్ ఇన్ చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. బీఆర్ఎస్ సైతం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూబ్లీహిల్స్ పరిధిలో తిరుగుతున్నారు. కాగా కమలం పార్టీ మాత్రం కేంద్ర మంత్రులపైనే ఆశలు పెట్టుకుంది. వారి ప్రచారంపైనే ఈ బైపోల్ లో ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రాష్ట్ర నాయకత్వం రిలీజ్ చేసింది. మొత్తం 40 మందికి ఈ జాబితాలో చోటు కల్పించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ ఉన్నారు. వారితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సైతం ఉన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ను సైతం ఈ జాబితాలో పార్టీ చోటు కల్పించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు తెలంగాణకు చెందిన 8 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు చోటు కల్పించగా కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ జాబితాలో చోటు కల్పించారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సైతం ఉన్నారు.
ఈ ఉప ఎన్నికల్లో గట్టెక్కుతారా? లేదా?
తెలంగాణ బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటి భవిష్యత్ ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంది. కాగా ఈ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంతో ఈ ఉప ఎన్నికల్లో గట్టెక్కుతారా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో పార్టీ అగ్ర త్రయంగా చెప్పుకునే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిమగ్నమవ్వడంతో ఈ ఉప ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. దీంతో అగ్ర త్రయం లేకుండా కేంద్ర మంత్రులతోనే పార్టీ ప్రచారం నిర్వహించనుంది. మరి వారి ప్రచారంతో జూబ్లీహిల్స్ లో బీజేపీ స్టార్ తిరుగుతుందా? కేంద్ర మంత్రులపై పెట్టుకున్న ఆశలు సత్ఫలితాలనిస్తాయా? లేదా? అన్నది చూడాలి.
