Gujarat Politics: గుజరాత్‌లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు (Gujarat Politics) జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా, మంత్రివర్గంలోని సభ్యులందరూ రాజీనామా చేశారు. శుక్రవారం జరగనున్న కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు ముందు మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేస్తూ, రిజైన్ లేఖలను సమర్పించినట్టు సమాచారం. అయితే, సీఎం భూపేంద్ర పటేల్ మాత్రం తన పదవిలోనే కొనసాగనున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో 7 నుంచి 10 మందికి మాత్రమే తిరిగి కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి.
మంత్రులంతా తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందించగా, కేబినెట్‌లో తిరిగి చోటుదక్కించుకోనున్న వారి లేఖలు మినహా, మిగతావాటిని గవర్నర్‌కు పంపించనున్నారని సమాచారం. ఇదే విషయమై గురువారం రాత్రి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను ముఖ్యమంత్రి పటేల్ కలసి చర్చించనున్నారని, మంత్రుల రాజీనామాల లేఖలను కూడా అధికారికంగా సమర్పించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే, గుజరాత్ ప్రభుత్వంలో భారీ మార్పులు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం గుజరాత్ కేబినెట్‌లో 16 మంది సభ్యులు ఉన్నారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ సంఖ్యను 26కు పెంచనున్నట్టుగా సంబంధితవర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని వెల్లడించారు. అంతకంటే ముందు, గురువారం సాయంత్రం సీఎం భూపేంద్ర పటేల్ నివాసంలో కీలక భేటీలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ కేబినెట్ విస్తరణపై చర్చించారు. వీరిద్దరూ కలిసి ఒక్కో మంత్రిని వ్యక్తిగతంగా మాట్లాడారని, పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేసి, వారి రాజీనామా లేఖలను స్వీకరించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. గుజరాత్ తదుపరి అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని అధిష్టానం నిర్ణయించిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ సమన్వయం చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త కేబినెట్‌లో కుల, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తారని, అదేవిధంగా యువతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో మార్పులు చేస్తున్నట్టు సమాచారం.
