VC Sajjanar: పండుగ వేళ తస్మాత్ జాగ్రత్త అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ హెచ్చరించారు. దీపావళిని పురస్కరించుకుని సైబర్ క్రిమినల్స్ వేర్వేరు రకాలుగా ఉచ్ఛు విసురుతూ డబ్బు కొల్లగొట్టే ప్రమాదముందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దివ్వెల పండుగ దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకొనే విషయం తెలిసిందే. ఈ పండుగ సమయంలో వేర్వేరు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవటానికి రకరకాల డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఆఫర్లు ఇస్తాయి. సరిగ్గా దీనినే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం అవకాశంగా మలుచుకుంటున్నారు. నకిలీ ఈ కామర్స్ సైట్ లను సృష్టించి వాటి ద్వారా భారీ తగ్గింపుల పేర వల విసురుతూ జనాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరికొందరు క్రిమినల్స్ ఏపీకే ఫైళ్లను పంపించి వాటిని డౌన్ లోడ్ ఇన్ స్టాల్ చేయించటం ద్వారా అవతలి వారి ఫోన్లను హ్యాక్ చేస్తూ ఖాతాలు ఊడ్చేస్తున్నారు. ఇంకొందరు ఫిషింగ్ లింకులు పంపిస్తూ జనం కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు.
Also Read: VC Sajjanar: కొంతమంది అలా డ్రైవింగ్ చేస్తున్నారు.. ఊరుకోబోం.. హైదరాబాదీలకు సజ్జనార్ వార్నింగ్
లక్కీ డ్రాల పేర అందినకాడికి లూటీ
ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గిఫ్ట్ హ్యాంపర్ల పేర మోసాలు చేస్తున్నారు. లక్కీ డ్రాల పేర అందినకాడికి లూటీ చేస్తున్నారు. ఈ మోసాల కోసం సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఉపయోగించుకుంటున్నారు. ఇలాగే సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతికి ఫోన్ చేసిన సైబర్ క్రిమినల్స్ తమను తాము ఫ్యాషర్ షాపింగ్ సైట్ ఎగ్జిక్యూటీవ్ లుగా పరిచయం చేసుకున్నారు. పండుగ నేపథ్యంలో మీకు స్పెషల్ గిఫ్ట్ ఆఫర్ ఉందని చెప్పారు. దీని కోసం 5వేల రూపాయల షాపింగ్ చేయాలన్నారు. ఈ మాటలు నమ్మిన యువతి వాళ్లు చెప్పిన ఖాతాకు 5వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఆ తరువాత మరోసారి ఫోన్ చేసి 9,849 రూపాయలు జీఎస్టీగా కడితే ఐ ఫోన్ 13 పంపిస్తామని చెప్పగా యువతి రెండోసారి కూడా డబ్బు ట్రాన్స్ ఫర్ చేసింది.
మొత్తం 1.40లక్షల రూపాయలను కొల్లగొట్టారు
ఇలా పలుమార్లు ఫోన్లు చేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి మొత్తం 1.40లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఆజంపురాలో నివాసముంటున్న ఓ వృద్ధునికి ఓ ఏపీకే ఫైల్ పంపించి ఇన్ స్టాల్ చేయించటం ద్వారా ఫోన్ ను హ్యాక్ చేసి లక్షా 2వేల రూపాయలను కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలోనే అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సజ్జనార్ సూచించారు. పరిచయం లేని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవద్దన్నారు. పండుగ సందర్భంగా గిఫ్ట్ వచ్చింది…స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామన్న మాటలు నమ్మవద్దన్నారు. ఒకేవేళ మోసానికి గురైతే మొదటి గంటలోనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. దాంతోపాటు www.cybercrime.gov.in. సైట్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మొదటి గంటలో కంప్లయింట్ ఇస్తేనే సైబర్ క్రిమినల్స్ కొల్లగొట్టిన డబ్బును బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ చేసే అవకాశాలు ఉంటాయన్నారు.
Also Read: Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు మావే.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
