Huzurabad: జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ మండలంలో నాడు కార్డియో పల్మనరీ రెసిసిటేషన్ (సిపిఆర్) పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. హుజురాబాద్ (Huzurabad) మండలం సింగపూర్ లోని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, చెల్పూర్ గ్రామంలో గల జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ చేల్పూర్ హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలేజ్ నందు ఈ శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమాలను డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ చందు పర్యవేక్షణలో జిల్లా శిక్షకులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ మధుకర్ మరియు ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ నిర్వహించారు.
డాక్టర్ చందు కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ, సిపిఆర్ అనేది అత్యవసర సమయాలలో ప్రాణాన్ని కాపాడే అద్భుత ప్రక్రియ అని కొనియాడారు. కార్డియాక్ అరెస్ట్ జరిగి తోటివారు అకస్మాత్తుగా పడిపోయి అపస్మారక స్థితిలో ఉంటే, తక్షణమే సిపిఆర్ ప్రక్రియను ఉపయోగించి వారిని తిరిగి బ్రతికించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ రోజుల్లో కార్డియాక్ అరెస్టులు సర్వసాధారణమవుతున్నందున, ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే బీపీ, షుగర్ల బారిన పడకుండా సరైన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.ఈ అవగాహన కార్యక్రమాలలో కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపక సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
Also Read: Huzurabad: హుజురాబాద్ లేబర్ ఆఫీస్‌లో అవినీతి జలగలు.. పైసలు ఇస్తేనే ఫైల్ కదులుతుంది!
పర్యావరణ పరిరక్షణకు టీచర్ల ఆచరణాత్మక మార్గదర్శనం.. ప్లాస్టిక్‌కు బదులు స్టీల్ వినియోగం
పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తూ, హుజురాబాద్ మండలంలోని ఉపాధ్యాయులు ఆచరణాత్మక మార్గదర్శనం చేశారు. హుజురాబాద్ మండలం సింగపూర్‌లోని కిట్స్ కళాశాలలో గత మూడు రోజులుగా ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన డిజిటల్ లెర్నింగ్ శిక్షణ కార్యక్రమంలో ఈ విశిష్టమైన పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం జరిగింది.
స్టీల్ వాడకంతో ఆదర్శం
ప్లాస్టిక్ వినియోగం వల్ల సమాజంపై పడుతున్న తీవ్ర ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు స్వయంగా ముందడుగు వేశారు. ఈ మూడు రోజుల శిక్షణ సమయంలో, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లకు బదులుగా, ఉపాధ్యాయులు తమతో పాటు స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లను తెచ్చుకుని టీ త్రాగడం, భోజనం చేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తూ, పర్యావరణ హిత దృక్పథాన్ని ఆచరణలో చూపారు.
ఉపాధ్యాయుల్లో మార్పు కీలకం
ఈ కార్యక్రమాన్ని ప్రేరేపించి, ఉపాధ్యాయులను ప్రోత్సహించిన జెడ్పీహెచ్ఎస్ దుద్దెనపల్లి స్కూల్ అసిస్టెంట్ శ్రీ కుమ్మరికుంట సుధాకర్ మార్గదర్శకత్వంలో ఈ అవగాహన కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, “పిల్లలకి పాఠశాలల్లో పర్యావరణంపై అవగాహన కల్పించాలంటే, ముందుగా మనమే అలవాట్లలో మార్పు తీసుకురావాలి” అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్‌ను వాడటం ద్వారా విద్యార్థులకు, సమాజానికి మంచి సందేశం అందించారు.
ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్‌గా మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలంపెల్లి ఆదర్శన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చూపిన ఈ పర్యావరణ హిత మార్పును పలువురు అభినందించారు.
Also Read: Huzurabad: అంగన్‌వాడీ గుడ్లతో.. మందుబాబులకు స్నాక్స్.. వామ్మో ఇలా ఉన్నారేంట్రా!
