Gadwal Collector: ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ (Gadwal Collector) బి.యం సంతోష్ (B.M Santhosh) సంబంధిత అధికారులకు ఆదేశించారు. పునరావాస కేంద్రంలో అన్ని సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడుతున్నందున, గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి ఇళ్లు నిర్మించి జీవితం కొనసాగించాలని కలెక్టర్ అన్నారు. ధరూర్ మండలంలో ర్యాలంపాడు పునరావాస కేంద్రంలోని సదుపాయాలు కల్పించే అంశమై జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, గద్వాల్ (Gadwal) శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి గ్రామస్తులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
1,80,000 ఎకరాలకు సాగునీరు అందించే 4 TMC రిజర్వాయర్ నిర్మాణం పూర్తి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాలంపాడు గ్రామ ప్రజలు తమ భూములను అందజేయడం వలన,జిల్లాలో 1,80,000 ఎకరాలకు సాగునీరు అందించే 4 TMC రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. భూములు కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వాటిని పునరాసవ కేంద్రాలలో అందజేస్తోందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు, త్రాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాము, గ్రామ పంచాయతీ భవనాలు, సబ్ సెంటర్లు, అంగన్వాడి కేంద్రాలు, దేవాలయాలు,చర్చిలు లాంటి అన్ని అవసరాలను లేఅవుట్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రతి ప్లాన్‌కి అనుగుణంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. భూసేకరణలో 67 ఎకరాల 28 గుంటలు భూమిలో మొత్తం 823 ప్లాట్లను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 695 ప్లాట్లును భూ నిర్వాసితులకు మంజూరు చేయడం జరిగిందని, సమస్యలు ఉన్న 5 ప్లాట్లను ఖాళీ ఉన్న ప్లాట్లలో మళ్లీ అందించడం జరుగుతుందని తెలిపారు.
Also Read: Jogulamba Gadwal: ఆ జిల్లాలో మాముళ్ల మత్తులో అధికారులు.. రహదారి పక్కనే సిట్టింగ్‌లు!
నూతన భూసేకరణ కోసం తగిన చర్యలు తీసుకుంటాం
78 ప్లాట్లలో నీరు నిలుస్తున్నందున, మట్టితో భర్తీ చేసే వాటిని లెవెల్ చేస్తామని తెలిపారు. అనుకూలంగా లేని మరో 14 ప్లాట్లను కూడా ఖాళీ ప్లాట్లలో మంజూరు చేయడం జరుగుతుందని, లేదా వాటికి సంబంధించిన నూతన భూసేకరణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ సమస్యలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు లింక్ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామానికి స్మశాన వాటికకు స్థలం కేటాయించడం జరుగుతుందని, అలాగే పెండింగ్‌లో ఉన్న షిఫ్టింగ్ చార్జీలను వెంటనే చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ గ్రామంలో 250 పైగా ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, మంజూరైన ప్రతి ఒక్కరు తమ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయని, అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించబడతాయని తెలిపారు. అర్హులైన వారికి రెండో విడతలో లబ్ధి పొందేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
1,80,000 ఎకరాలకు సాగునీరు
గ్రామంలో ప్రభుత్వం ద్వారా అన్ని సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందని, లబ్ధిదారులు ప్రతి ఒక్కరు తమ ఇళ్లు నిర్మాణాలను పూర్తిచేసుకుని సంతోషంగా, సౌభాగ్యవంతంగా జీవించాలని ఆకాంక్షించారు. గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గద్వాల్ అభివృద్ధిలో ర్యాలంపాడు గ్రామం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రైతులు తమ స్వంత వ్యవసాయ భూములను త్యాగం చేయడం వలన, 4 టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమై, దాని ద్వారా 1,80,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని పేర్కొన్నారు. రైతుల త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని, వారికి తగిన గౌరవం, సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గతంలో ముంపుకు గురైన ఆలూరు,చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి తదితర గ్రామాల్లో ఇప్పటికే అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అందిస్తామని తెలియజేశారు.
అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి
ర్యాలంపాడు గ్రామానికి కూడా అదే విధంగా అన్ని వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ర్యాలంపాడు గ్రామంలో ఎక్కువ మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించి వారికి ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి కుటుంబం తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామాల్లో స్థిరంగా నివసించాలని సూచించారు. ఆర్ & ఆర్ సెంటర్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకూడదని, అధికారులందరూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.ప్రజలకు పిలుపునిస్తూ, మీ సహకారంతోనే ఈ గ్రామం సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లేఅవుట్ మ్యాప్‌ను పరిశీలించి,అన్ని పనుల వివరాలు,ప్రగతి పనుల పురోగతి గురించి చర్చించారు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన జిల్లా గ్రంధాలయ చైర్మన్
