Land scam: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే పెన్షింగ్‌లు వేస్తూ, కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులు దర్జాగా కాజేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధుల కళ్ళు కప్పి ఈ అక్రమ తతంగం యథేచ్ఛగా నడుస్తోంది. రంగారెడ్డి(Rangareddy) జిల్లా హయత్నగర్మండలం అన్మగల్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 191లో ఉన్న ఎకరం 9 గుంటల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. కబ్జాదారులు ఈ భూమిని గుంట గుంటలకు ఫ్రీకాస్ట్ వేసి విక్రయిస్తున్నారు. నాలుగేండ్లుగా కాపాడిన భూమి సైతం అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాలకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ మున్సిపాలిటీలోని ఎల్బీనగర్ సర్కిల్-3లో భాగమైన హయత్‌నగర్ డివిజన్ సరిహద్దు ప్రాంతంలో ఈ భూదందా నడుస్తోంది. అధికారులు వేసిన సూచిక బోర్డును సైతం పెడచెవిన పెట్టి కబ్జాదారులు నిర్మాణాలు చేపడుతున్నారు.
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతో..
విజయవాడ–నాగార్జునసాగర్ జాతీయ రహదారులను కలిపే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 191 సర్వే నెంబర్‌లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో భాగమైన ఇంజాపూర్ రెవెన్యూకు ఆనుకుని, హయత్‌నగర్ డివిజన్ అన్మగల్ రెవెన్యూలో సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారుల కళ్లు కప్పి కబ్జాలు చేస్తున్నారు. గతంలో అనేకమార్లు స్థానిక రెవెన్యూ(Revenue) అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు ఆ స్థలాన్ని ప్రజాప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. అయినప్పటికీ, జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల విలువైన భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అంతేకాకుండా, మిథులా అపార్ట్‌మెంట్‌కు రహదారి సుదూరంగా ఉన్న కారణంగా, సర్వే నెంబర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ స్థలంలో నుంచే రహదారి నిర్మాణం చేపట్టడం దారుణం.
Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మోగిన నగారా.. గెజిట్ రిలీజ్!
వారి అండతోనే..
అన్మగల్ సర్వే నెంబర్ 191లో జీహెచ్‌ఎంసీ అధికారులు పెట్టిన సూచిక బోర్డును లెక్క చేయకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు పాల్పడే వ్యక్తుల వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నట్లు బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాలు మారినా కబ్జాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు కొనసాగుతున్నాయి. కబ్జాదారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులకు దగ్గరగా ఉండి, వారి పేరు చెప్పుకుంటూ ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు, చెరువుల స్థలాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే తరహాలో మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలోని సర్వే నెంబర్ 166/1, 166/2లో నిర్మించిన హెచ్‌ఎండీఏ లేఅవుట్ యాజమాన్యం, కీసర మండలం రాంపెల్లిలోని సర్వే నెంబర్ 618లోని పరిశ్రమల యాజమాన్యం కూడా ప్రభుత్వ స్థలాల నుంచి అక్రమంగా రోడ్లు నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్టు మండలాల పరిధిలో కూడా ఓ రియల్ ఎస్టేట్ యాజమాన్యం తమ లేఅవుట్ల కోసం విలువైన ప్రభుత్వ భూమిలో నుంచే రోడ్లను అక్రమంగా నిర్మిస్తోంది.
Also Read: Child Protection: ఉన్నత లక్ష్యంతో క్రమశిక్షణతో చదవాలి.. బాలల సంరక్షణ లీగల్ అధికారి!
