Railway Diwali Alert: హిందువులకు ఎంతో పవిత్రమైన దీపావళి పర్వదినం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే వాటిల్లో టపాసులు కచ్చితంగా ఉంటాయి. చీకటిని పారదోలి, వెలుగులు నింపడానికి ప్రతీక అయినప్పటికీ, క్రాకర్స్ పట్ల అజాగ్రత్తగా ఉంటే విషాద ప్రమాదాలకు దారితీసే ముప్పు పొంచివుంటుంది. ఇక, ఎల్లప్పుడూ ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇచ్చే ఇండియన్ రైల్వేస్… దీపావళి పండుగ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటిమాదిరిగానే కొన్ని నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తుంది. పండుగ సమీపిస్తుండడంతో దేశవ్యాప్తంగా రైలు మార్గాల ద్వారా తమ స్వస్థలాలకు వెళ్లే ప్యాసింజర్లు ఈ రైల్వే నిబంధనలపై అవగాహనం కలిగివుండడం చాలా మంచిది. లేదంటే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. మరి, ఆ రూల్స్ ఏమిటో (Railway Diwali Alert) మీరు కూడా తెలుసుకోండి మరి.
క్రాకర్స్ తీసుకెళ్లకూడదు
పండుగ సందర్భంగా చాలామంది ప్యాసింజర్లు తమ బంధువులకు స్వీట్లు, కొత్త దుస్తులు, ఇతర వస్తువులు తీసుకెళుతుంటారు. అయితే, కొన్ని వస్తువులను మాత్రం రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. ఆ జాబితాలో క్రాకర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి, అవగాహన లేకుండా టపాసులతో రైలు ప్రయాణాలు చేద్దామనుకుంటే ఇబ్బందుల్లో పడతారని రైల్వే అధికారులు గుర్తుచేస్తున్నారు. మండే, లేదా పేలుడు స్వభావం ఉన్న ఎలాంటి వస్తువులు, పదార్థాలకు రైళ్లలో అనుమతి ఉండదని అంటున్నారు. చిన్న చిన్ని మంటలు సైతం తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని, అందుకే, ప్యాసింజర్ల భద్రత కోసం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్టు గుర్తుచేశారు.
దొరికితే మూడేళ్ల జైలుశిక్ష
ఇండియన్ రైల్వేస్ యాక్ట్ ప్రకారం, నిషేధిత వస్తువులను రైళ్లలో తీసుకెళితే నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. చట్టంలోని సెక్షన్ 164 కింద పట్టుబడిన ప్రయాణికులకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. లేదంటే, మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. తీవ్రతను బట్టి కొన్నిసార్లు రెండు శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముమ్మరంగా తనిఖీలు
అవగాహన లేని ప్రయాణికులు టపాసులను తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ప్రతి ఏడాది దీపావళి పండుగ సమయంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో తనిఖీలు జరుగుతుంటాయి. అన్ని స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేస్తుంటారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది స్టేషన్లలో, రైళ్ళలో ప్రత్యేక తనిఖీలు చేపడుతుంటారు. క్రాకర్స్ తీసుకెళ్తూ ఎవరైనా పట్టుబడితే నిబంధనలు ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. ప్యాసింజర్ల సేఫ్టీ లక్ష్యంగా మండే స్వభావం ఉన్న పదార్థాలు, కెమికల్స్, క్రాకర్స్, గ్యాస్ సిలిండర్లు, ఈ తరహా ఇతర హానికర వస్తువులను రైళ్లలో తీసుకెళ్లనివ్వబోమని ఈ సందర్భంగా రైల్వే అధికారులు గుర్తుచేస్తున్నారు.
టపాసులకు విశిష్ట ప్రాధాన్యత
దీపావళి ఫెస్టివల్‌కు టపాసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. మరీ ముఖ్యంగా పిల్లలు, వారితో పాటు పెద్దలు కూడా సంబురంగా క్రాకర్స్ కాలుస్తుంటారు. చీకటిని పారదోలి, వెలుగును నిండాయని చాటిచెప్పేందుకు టపాసులు సంకేతంగా నిలుస్తుంటాయి. అంతేకాదు, టపాసుల శబ్దం దుష్ట శక్తులను పారదోలుతుందని దేశంలొని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తుంటారు.
Read Also- Coldref Syrup Deaths: తెరవెనుక కథ.. దగ్గు సిరప్ ‘కోల్డ్రిఫ్’పై ఎంత కమిషన్ ఇస్తారో చెప్పేసిన డాక్టర్
