Palamuru University: ఈనెల 16న పాలమూరు విశ్వవిద్యాలయ నాలుగవ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తోబాటుగా ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు,ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారని వీసి తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా 12 పీహెచ్డీ పట్టాలు, 83 గోల్డ్ మెడల్స్, 2809 పీజీ పట్టాలు, 8291 ప్రొఫెషనల్ కోర్సుల పట్టాలు, 18,666 అండర్ గ్రాడ్యుయేషన్ పట్టాలు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలమూరు యూనివర్సిటీని మంజూరు చేశారన్నారు. ఆ తర్వాత క్రమంలో యూనివర్సిటీ అంచలంచెలుగా వృద్ధి చెందుతూ వస్తుందన్నారు.
గత దశాబ్ద కాలంలో విశ్వవిద్యాలయం విశేష పురోగతిని సాధించింది అన్నారు. ఇటీవలే న్యాక్ అక్రిడేషన్ ప్రక్రియను పూర్తిచేసుకుని, యూనివర్సిటీ తన పూర్వపు గ్రేడ్ ను పదిల పరచుకుందన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కళాశాలలను మంజూరు చేశారన్నారు. ఈ విద్యా సంవత్సరం ఈ రెండు కళాశాలల తరగతులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ యూనివర్సిటీ పథకంలో భాగంగా పాలమూరు విశ్వవిద్యాలయానికి వంద కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. యూనివర్సిటీలో భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన తదితరాల కోసం ఈ నిధులను వెచ్చించినట్లు తెలిపారు.
యూనివర్సిటీలో పూర్వ విద్యార్థుల వేదిక ఆలుమ్నినీ కూడా ప్రారంభించామని, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
