EPFO New Rules: వేతన జీవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఎప్పటికప్పుడు నిబంధనలను సడలిస్తూ వస్తున్న ఈపీఎఫ్‌వో (EPFO) తాజాగా మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇన్నాళ్లూ కొంతపరిమితి వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇకపై పూర్తిగా, అంటే 100 శాతం బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకునే అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు (EPFO New Rules) తీసుకొచ్చింది. యాజమాన్య సంస్థ, ఉద్యోగి తరపున జమ అయిన మొత్తాన్ని ఒకేసారి తీసుకొవచ్చు. అంతేనా, ముఖ్యమైన మరికొన్ని రూల్స్‌ను కూడా ఎంప్లాయీస్‌కు అనుకూలంగా సవరించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన 238వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
మరింత తేలికగా..
ఈపీఎఫ్ అకౌంట్‌లోని నగదు ఉపసంహరణకు సంబంధించి ఇది వరకు మొత్తం 13 రూల్స్ ఉండేవి. దీంతో, ఉద్యోగులు ఒకింత తికమకపడుతున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విత్‌డ్రా ప్రక్రియను తేలికగా, స్పష్టంగా ఉండేందుకుగానూ 13 వేర్వేరు రూల్స్‌ను ఒక్కటిగా కలిపివేసింది. వీటిని మూడు కేటగిరీలుగా విభజించింది. అత్యవసర అవసరాలు కేటగిరీలో అనారోగ్యం, విద్య, పెళ్లి ఉన్నాయి. ఇక, గృహ అవసరాల సెక్షన్‌లో ఇల్లు కొనుగోలు, ఇంటి నిర్మాణాన్ని చేర్చింది. ప్రత్యేక పరిస్థితుల కేటగిరీలో జాబ్ పోవడం, విపత్తులను చేర్చింది. ప్రత్యేక అవసరాలకు నగదు విత్‌డ్రా చేసుకునేటప్పుడు, ఇకపై కారణాన్ని కూడా చెప్పాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.
ఎడ్యుకేషన్ కోసం 10 సార్లు ఛాన్స్
పిల్లల చదువు కోసం ఉద్యోగులు ఏడాదిలో గరిష్ఠంగా 10 సార్లు మనీ విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. పెళ్లి కోసం 10 సార్లు అవకాశం ఉంటుంది. గతంలో పెళ్లి కోసం 3 సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై ఉద్యోగి సర్వీస్ కాలం కనీసం 12 నెలలు ఉంటేనే, ఏ కారణంతోనైనా పాక్షిక ఉపసంహరణ చేయడానికి అవకాశం ఉంటుంది.
మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, 8.25 శాతం వడ్డీ రేటు వర్తించాలంటే పీఎఫ్ అకౌంట్‌లో ఏడాది పొడవునా కనీసం 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఈపీఎఫ్‌వో షరతు విధించింది. ఈ నిబంధన కింద ఉద్యోగులకు రిటైర్మెంట్ నాటికి ఉపయోగపడే స్థాయిలో ఫండ్ వృద్ధి చెందుతుందని ఆశిస్తోంది. మరోవైపు, క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఇకపై ఆటోమేటిక్ జరుగుతాయి. డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. ఇక, అత్యంత ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఫైనల్ ఈపీఎఫ్ విత్‌డ్రా కోసం ఇదివరకు 2 నెలలు వేచివుండాల్సి ఉండగా.. ఇప్పుడు దాని గడువును 12 నెలలకు పెంచింది. ఫైనల్ పెన్షన్ ఉపసంహరణ గడువును 2 నెలల నుంచి 3 సంవత్సరాలకు పొడిగించింది.
