Telangana BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ఎంపిక ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఇతర పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుండగా కాషాయ పార్టీ ఇంకా అభ్యర్థి ఎంపికపైనే మల్లగుల్లాలు పడుతుండడంతో శ్రేణులు నిరాశలో ఉన్నారు. పార్టీ ఇంకా నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తుండడంతో పనిచేయాలనే ఊపు, ఉత్సాహం క్రమంగా మసకబారుతోందని తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా అభ్యర్థి ఎవరనేది పార్టీ తేల్చుకోలేకపోతున్నది. దీంతో ఆశావహుల్లోనూ ఉత్కంఠతో పాటు నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. అఫీషియల్ అనౌన్స్‌పై రాష్ట్ర నాయకత్వం రేపు, మాపు అంటూ నాన్చుడు దాట వేస్తుండడంతో వారిలో ఆందోళన మరింత ఎక్కువవుతున్నది. ఎవరో ఒకరి పేరును ఫైనల్ చేస్తే ఇతర పనుల్లో అయినా నిమగ్నమయ్యే అవకాశముంటుందనే చర్చ మొదలైంది.
ఇంకొందరు పేర్లను పంపించండి
ఉప ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించాయి. కాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. హైకమాండ్‌కు పంపిన పేర్లతో సంతృప్తిగా లేదని చర్చించుకుంటున్నారు. ఇంకొందరు నేతల పేర్లను సైతం పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. అందుకే ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే వారికి ఇవ్వాలనే యోచనలో అభ్యర్థి ప్రకటనను ఆలస్యం చేస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. ఇంకా బలమైన నేత ఉంటే బెటర్ అనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ తరుణంలో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్(Vikranm Goud) పేరు సైతం పరిశీలనలోకి వచ్చినట్లుగా సమాచారం. పలువురు ఎంపీలు ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని హైకమాండ్ వద్ద ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తున్నది. బీజేపీ నుంచి ప్రధానంలో రేసులో లంకల దీపక్ రెడ్డి(deepak Reddy)తో పాటు జూటూరి కీర్తిరెడ్డి(Keerthi Reddy) ఉన్నారు. తాజగా విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి రావడంతో బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుందా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో బీజేపీ వెళ్లింది. అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా ముద్రపడడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరినట్లయింది.
Also Read: Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి జవాన్‌కు తీవ్ర గాయాలు
విక్రమ్ గౌడ్‌కు అవకాశం ఇస్తే పార్టీకి ప్లస్
జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో విక్రమ్ గౌడ్ కు అవకాశం కల్పిస్తే ఆయనకు కలిసొచ్చే అంశాలను సైతం హైకమాండ్ వద్ద ఎంపీలు వివరించినట్లు తెలిసింది. ముఖేశ్ గౌడ్ కాంగ్రెస్ నేత కావడంతో పాత కాంగ్రెస్ ఆయన వెంట ఉంటుందని, అలాగే బీఆర్ఎస్‌కు చెందిన వారు కూడా సపోర్ట్‌గా నిలిచే అవకాశముందని, ఇది కాషాయ పార్టీకి ప్లస్ అవుతుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఆదివారం పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానంగా బీహార్ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 8 చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రమైన ఒరిస్సా నుంచి ఈ మీటింగుకు ఎవరూ వెళ్లకపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల అంశాన్ని టచ్ చేయలేదని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈ మీటింగ్ లో అసలు చర్చకే రాలేదని విశ్వసనీయ సమాచారం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అగ్ని పరీక్ష
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గం జూబ్లీహిల్స్. కిషన్ రెడ్డి(Kishna Reddy)కి ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. అభ్యర్థి ఎంపిక మొదలు అన్ని గెలుపు బాధ్యతలు కూడా ఆయనపేనే రాష్ట్ర నాయకత్వం మోపింది. కానీ, కిషన్ రెడ్డి మాత్రం దీని నుంచి తప్పించుకునే యోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. గెలిస్తే ఒకే.. కానీ, అనుకోకుండా ఓడిపోతే మాత్రం తన లోక్‌సభ పరిధిలో ప్రతికూల పరిస్థితి ఎదురయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఆయన ఈ ఎన్నికలపై అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అందుకే అభ్యర్థి ఎంపిక అంశం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకే వదిలేసినట్లు టాక్. అభ్యర్థులంతా తన వాళ్లేనంటూ హైకమాండ్‌కు స్పష్టంచేశారని సమాచారం. బిహార్ ఎన్నికల తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి మార్పు ఉండే అవకాశముంది. క్యాబినెట్‌లోనూ ప్రక్షాళన ఉండే అవకాశమున్న నేపథ్యంలో ఆ ప్రభావం తనపై పడొద్దని కిషన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది. టికెట్ ఒకరికి ఇచ్చి మరొకరికి వద్దంటే చివరకు తాను ఇరుక్కుపోతాననే భయంతో ఈ అంశం నుంచి స్కిప్ అవ్వడమే ఉత్తమమని భావిస్తున్నట్లు వినికిడి.
అయోమయంలో బీజేపీ శ్రేణులు
కారు, హస్తం పార్టీలు మాగంటి సునీత, నవీన్ యాదవ్‌ను తమ అభ్యర్థులుగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ, కాషాయ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపికపై క్లారిటీ ఇవ్వకపోవడంతో శ్రేణులు అయోమయంలో పడ్డాయి. అభ్యర్థి ఎంపికకు ఇంకా ఒకట్రెండు రోజులు పట్టే అవకాశముందని స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా క్లారిటీ ఇవ్వకపోవడంతో శ్రేణులు అయోమయంలో పడ్డాయి. పార్టీలో ఏం జరుగుతోందో అర్థంకాక గందరగోళంలో ఉన్నారు. ఇలా అయితే పార్టీ గెలుపు ఎలా సాధ్యమని శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పార్టీ అభ్యర్థిని ప్రకటించేదెన్నడు? ప్రచారం చేసేదెన్నడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ గందరగోళానికి ఎప్పుడు చెక్ పడుతుందనేది చూడాలి.
Also Read: Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి జవాన్‌కు తీవ్ర గాయాలు
