Gadwal Collector ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ద్వారా అన్నదాతలు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనకు జోగులాంబ గద్వాల జిల్లా ఎంపికవడంతో ఢిల్లీలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించగా, గద్వాల ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని తిలకించారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ‘మాది గేదెలాంటి ప్రభుత్వం’.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు
నేల సారవంతతను బట్టి రైతులు విభిన్న పంటలు వేసేలా ప్రోత్సహం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేల సారవంతతను బట్టి రైతులు విభిన్న పంటలు వేసేలా ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడం, అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ శాఖతోపాటు మత్స్య, పశుసంవర్ధక, ఉద్యానవన, నీటిపారుదల, బ్యాంకింగ్, తదితర 11 శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని జిల్లాలో ముందుకు తీసుకు పోవడం జరుగుతుందన్నారు. పీఎండిడికేయూ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణానికి సైతం అవకాశం ఉందన్నారు. గోదాములు నిర్మించడానికి నాబార్డ్ ద్వారా 50% సబ్సిడీ రుణాలు వస్తున్నందున గ్రామ, మండల స్థాయిలో కూడా ఔత్సాహికులు గోదాములు నిర్మించుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలన్నారు.
40 వేల ఎకరాలకు సాగునీరు
జిల్లాలోని రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకర్లు ముందుండాలని, వ్యవసాయ రంగంలో జిల్లా ప్రగతి సాధించేందుకు దోహదపడాలని కోరారు. రైతులు సాయిల్ హెల్త్ కార్డును తీసుకొని వాటికి అనుగుణంగా ఎలాంటి పంటలు వేయాలో వ్యవసాయ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఒకే పంటపై దృష్టి సారించకుండా విభిన్న పంటలు సాగు చేస్తున్నప్పుడు ఉత్పాదకత పెరిగి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా మరికొన్ని ప్యాకేజీ పనులు త్వరలోనే పూర్తి చేసి అదనంగా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
50 ఎకరాల్లో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం
జిల్లాలోని రైతులకు ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణాల విషయంలోనూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. జిల్లాలో 50 ఎకరాల్లో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి 20 నుంచి 30 మంది రైతులను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది మిగతా రైతులకు స్ఫూర్తినివ్వాలని పేర్కొన్నారు.
ప్రతి 15 రోజులకోసారి పథకం అమలు
ప్రతి 15 రోజులకోసారి పథకం అమలు తీరుపై రివ్యూ నిర్వహించడం జరుగుతుందన్నారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి దేశంలోనే జోగులాంబ గద్వాల జిల్లా మంచి ర్యాంకు సాధించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇన్చార్జి డిఏఓ జగ్గు నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. రూ. కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం!
