Nobel Peace Prize 2025: ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక శాంతి బహుమతి (Nobel Peace Prize 2025)ని నార్వేజియన్ నోబెల్ కమిటీ (Norwegian Nobel Committee) ప్రకటించింది. వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు ఈ పురస్కరం ప్రకటించారు. వెనిజుల ప్రజల ప్రజాస్వామ్య హక్కులు, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ శాంతి బహుమతికి ఎంపిక చేయడం విశేషం.
వెనిజులా ఐరన్ లేడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ బహుమతి కోసం ఆశిస్తున్న వేళ.. ఆయన్ను కాదని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్గెన్ వాట్నె ఫ్రైడ్‌నెస్ (Jorgen Watne Frydnes) మరియా పేరును ప్రకటించారు. ఆమెను శాంతి పురస్కారానికి ఎంపిక చేయడానికి గల కారణాలను జోర్గెన్ ప్రపంచానికి తెలియజేశారు. నియంతృత్వ పాలన నుంచి విముక్తి కల్పించి ప్రజాస్వామ్య దిశగా వెనెజులాను తీసుకెళ్లేందుకు ఆమె అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. శాంతియుత మార్గంలో తన నిరసనలను తెలియజేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ప్రభుత్వం నుంచి ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయలేదని చెప్పారు. ఏడాదిన్నరగా అజ్ఞాతంలో ఉన్న ఆమె.. శాంతి మార్గంలో ప్రజాస్వామ్యానికి కృషి చేసి ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
BREAKING NEWS
The Norwegian Nobel Committee has decided to award the 2025 #NobelPeacePrize to Maria Corina Machado for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to… pic.twitter.com/Zgth8KNJk9— The Nobel Prize (@NobelPrize) October 10, 2025
ప్రతీపక్షనేతగా పోటీ..
‘వెంటే వెనిజులా’ అనే రాజకీయ పార్టీని స్థాపించిన మరియా కొరినా మచాడో.. హ్యూగో చావేజ్ (మాజీ), నికోలస్ మడురో (ప్రస్తుత అధ్యక్షుడు) ప్రభుత్వాల దుర్వినియోగాలకు వ్యతిరేకంగా పోరాడారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మడురో పై పోటీ చేయాలని భావించినప్పటికీ.. ప్రభుత్వం అమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. అంతేకాదు ఎన్నికలకు ముందు విపక్ష నేతల నిర్భంధం, కీలక అభ్యర్థుల అర్హత రద్దు, మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 20 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు అధ్యక్షుడు నికోలస్ కనుసన్నల్లో పనిచేసే జాతీయ ఎన్నికల మండలి తిరిగి అతడ్నే అధ్యక్షుడికి ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన నికోలస్ మడురో.. మరియాపై కక్ష్యపూరిత చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆమె బయటకు రాలేదు.
పాపం ట్రంప్..
ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపానని తనకు తానే చెప్పుకుంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇందుకు గాను నోబెల్ బహుమతి ఇవ్వాలని కోరుకున్నాడు. తాను కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడానని.. తనకు కాకుండా ఇంకెవరికి ఇస్తారన్న రేంజ్ లో పలు వేదికలపై ప్రసంగించారు. తీరా వెనిజులా ఐరన్ లేడీకి.. పురస్కారం లభించడంతో ట్రంప్ కు బిగ్ షాక్ తగిలించింది. తాను 7 యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకుంటున్నప్పటికీ అందులో వాస్తవం లేదు. ఇజ్రాయెల్ – ఇరాన్, భారత్ – పాక్, ఆర్మేనియా – అజర్ బైజాన్, రువాండా కాంగో మధ్య ఉద్రిక్తతలు మాత్రమే పరసర్ప దాడులకు దారి తీశాయి. కానీ ట్రంప్ చెప్పుకుంటున్న ఈజిప్ట్ – ఇథియోపియా (నైలు నది వివాదం), సెర్బియా – కోసోవో (సాధారణ ఉద్రిక్తతలు) మధ్య అసలు సైనిక ఘర్షణలే తలెత్తలేదు. పైగా పాక్ పై ఘర్షణలను తానే ఆపానంటూ చెప్పుకుంటున్న ట్రంప్ ప్రకటలను భారత్ బహిరంగంగానే ఖండించింది. దీనికి తోడు ఈ ఏడాది జనవరి 31తోనే నోబెల్ బహుమతికి నానినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆ లోపు ట్రంప్ కు సంబంధించి ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. కాబట్టి నోబెల్ కమిటి అతడ్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
