Mulugu District: మహమ్మారీ కన్నా ప్రమాదకరంగా మారిన ఇసుక అక్రమ దందా(Illegal sand mining) సాధారణ ప్రజల జీవితాలను చిద్రం చేస్తోంది. నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చి, కాంట్రాక్టర్లు సాగిస్తున్న ఇష్టారాజ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది మణుగూరు టూ కమలాపురం(Kamlapuram) ప్రధాన రహదారి. కాసుల వేటలో కళ్లు మూసుకుపోయిన ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లు, తమ సొంత సామ్రాజ్యంలా ఈ రహదారిని మార్చేశారు. ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్రమైన నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల రవాణా తో ఇతర వాహనాలకు రవాణా సౌకర్యాలు బంద్ అవడంతో పాటు, రహదారులు రణరంగంగా మారుతున్నాయి. పాలక పక్షం చేతుల్లో అధికారులు కీలుబొమ్మలవుతున్నారు. అంతేకాకుండా అక్రమ ఇసుక వ్యాపారులు ఇచ్చే అమ్యమ్యాలకు దాసోహం అవుతూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అక్రమ ఇసుక వ్యాపారుల రవాణా తీరు, అధికారుల వ్యవహార శైలితో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.
అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి
ప్రధాన రహదారికి ఇరువైపులా వందలాది ఇసుక లారీలు బారులు తీరాయి. ఎటు చూసినా లారీలే! కాంట్రాక్టర్ల అండతో డ్రైవర్లు తమ లారీలను ఎక్కడపడితే అక్కడ నిలిపివేయడంతో, ఇది రోడ్డా లేక లారీల పార్కింగ్ స్థలమా అనే అనుమానం కలుగుతోంది. ఈ అరాచకపు చర్యల కారణంగా, అత్యవసరమైతే ప్రజలకు సాయం అందించే అంబులెన్స్ కూడా సకాలంలో చేరుకోలేని దుస్థితి నెలకొంది. రోగి ప్రాణం గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతున్నా, ఈ ఇసుక రాకాసుల అడ్డంకులు తొలగే పరిస్థితి కనిపించడం లేదు.
Also Read: Medchal: బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.. పటాకులు కాల్చే వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యార్థుల భవిష్యత్తుపై కాంట్రాక్టర్ల కత్తి
కేవలం అంబులెన్స్ మాత్రమే కాదు, ఈ లారీల రణగోణ ధ్వని, ట్రాఫిక్ జామ్(Traffic Jam) కారణంగా చిన్నారుల చదువులు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. రోడ్డుపై పేరుకుపోయిన లారీల సంఖ్య, వాహనాల రద్దీతో స్కూల్ బస్సులు ప్రైవేట్ వాహనాలు రాలేక విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బాలల భవిష్యత్తుకు మార్గంగా ఉండాల్సిన రోడ్లు, కాంట్రాక్టర్ల డబ్బు దాహానికి బందీ అయ్యాయి. ఉపాధి కోసం, అత్యవసర పనుల కోసం వెళ్లే సామాన్య ప్రజల కష్టాలు వర్ణనాతీతం.
అధికారుల మౌనం.. మాఫియాకు వరం!
ఈ అరాచకమంతా కళ్ల ముందు జరుగుతున్నా, స్థానిక అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. ఇసుక అక్రమార్కుల ముడుపులకు లొంగిపోయి, ప్రజా సమస్యను పట్టించుకోకుండా వారికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యవహారంలో మౌనం పాటించడం, ఇసుక మాఫియాకు పరోక్షంగా వరం ఇస్తున్నట్లేనని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఈ ఇసుక సామ్రాజ్యపు అరాచకానికి ముకుతాడు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు.
Also Read; TG High Court: హైకోర్టు సంచలన తీర్పు.. బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై స్టే
