Huzurabad: హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో డెంగ్యూ సహా విష జ్వరాలు విపరీతంగా విజృంభిస్తున్నప్పటికీ, మలేరియా నివారణ విభాగానికి చెందిన ముఖ్య అధికారి విధులకు గైర్హాజరు అవుతుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ(DMHO) పరిధిలోని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు కొంతకాలంగా జాడలేకుండా పోవడం, ఈ సమయంలోనే సీజనల్ వ్యాధులు ప్రబలడం ఆందోళన కలిగిస్తోంది.
వేతనం మాత్రం పక్కా..
హుజూరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహించాల్సిన సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు(Rajender Raju) కార్యాలయానికి రాకుండా గైర్హాజరవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది ఫోన్ చేస్తే కరీంనగర్(karimnagar) జిల్లా కేంద్రంలో ఉన్నానని చెబుతున్నట్లు సమాచారం. జిల్లా అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి, విధులకు పంగనామాలు పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ అధికారి అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్‌ను కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది. కార్యాలయం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, నెల నెలా విధులకు రాకుండానే వేతనం పొందుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. జిల్లా మలేరియా విభాగంలోని ఒక ఉన్నతాధికారి అండదండలతోనే ఆయన విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read; Kantara Chapter 1: ఆ రికార్డుకు చేరువలో ‘కాంతార చాప్టర్ 1’.. కన్నడలో మరో వెయ్యి కోట్ల సినిమా!..
నిర్వీర్యమైన డ్రై.. డే
గత కొన్ని నెలలుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెల్పూర్, వావిలాల, చల్లూరు, శంకరపట్నం, ఇల్లందకుంట, సైదాపూర్, వీణవంక వంటి పలు గ్రామాల్లో విష జ్వరాలు, డెంగ్యూ విపరీతంగా ప్రబలి, ప్రజలు మంచం పడుతున్నారు. వాస్తవానికి, అంటు వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవడం, పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించడం, హెల్త్ క్యాంపులు నిర్వహించడం సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రధాన విధి. కానీ, అధికారి అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ప్రతి శుక్రవారం, మంగళవారం నిర్వహించాల్సిన డ్రై డే కార్యక్రమం పూర్తిగా నిర్వీర్యమైంది. బ్లడ్ శాంపిల్ కలెక్షన్, డెంగ్యూ, మలేరియా పరీక్షలు కూడా సరిగా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగానే విష జ్వరాల ఉధృతి పెరిగి, బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
ఇంకెన్నాళ్లు ఇలా..?
మలేరియా నివారణ విభాగానికి చెందిన అధికారి స్వయంగా తన విధులను గాలికొదిలేయడంపై, ఉన్నతాధికారులు కూడా ఆయన తీరును పట్టించుకోకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా వారు దాటవేస్తున్నారని సమాచారం. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న సబ్ యూనిట్ ఆఫీసర్‌పై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Purisethupathi music: పూరి, సేతుపతి సినిమాకు సంగీత దర్శకుడు సెట్.. ఎవరంటే?
