Landslide tragedy: నిత్యం ప్రకృతి విపత్తులకు నెలవైన ‘పర్వతాల రాష్ట్రం’ (Land of Mountains) హిమాచల్‌ప్రదేశ్‌లో మరో పెనువిషాదం (Landslide tragedy) చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. బల్లూ బ్రిడ్జి సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల కింద బస్సు కూరుకుపోయింది. కొంతభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 18 మంది చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఇప్పటివరకు ముగ్గుర్ని ప్రాణాలతో వెలికితీశారు. ఘటనా స్థలంలో ఎక్స్‌కవేటర్ ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పలువురు ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే, రెస్క్యూ చర్యలను ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై బిలాస్‌పూర్ డిప్యూటీ కలెక్టర్ రాహుల్ కుమార్ స్పందించారు. ఇప్పటివరకు 18 మంది మృతి చెందారని, ముగ్గురిని ప్రాణాలతో రక్షించినట్లు వెల్లడించారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. కానీ, కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. ఈ దుర్ఘటన బాల్లూ బ్రిడ్జికి సమీపంలో జరిగిందని, కొండచరియలు విరిగి బస్సుపై పడ్డాయని రాహుల్ కుమార్ తెలిపారు. భారీ కొండచరియల ప్రభావంతో బస్సు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయిందని వివరించారు.
Read Also- Swetcha Special: అలసిపోయి ఆగిపోతున్న గుండెలు.. వైద్యుల సూచనలు ఇవే!
కాగా, ఘటనా స్థలానికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. జేసీబీ ద్వారా శిథిలాలను తొలగిస్తుండడం, పలువురు వ్యక్తులు బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. ఇక, ప్రమాదానికి గురైన బస్సు తీవ్రంగా దెబ్బతినడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. బస్సు మారోటన్- కలౌల్ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందిన వెంటనే, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ విభాగం బృందాలు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే శిథిలాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి.
Read Also- Travel Date Change: రైల్వేస్ నుంచి ఊహించని గుడ్‌న్యూస్.. ఇకపై టికెట్ కన్మార్ఫ్ అయ్యాక కూడా..
సీఎం సుఖ్విందర్ స్పందన
బస్సుపై కొండచరియలు విరిగిపడిన విషాదంపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, రెస్క్యూ చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ యంత్రాంగాన్ని వినియోగించాలంటూ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. జిల్లా యంత్రాంగంతో నిరంతరం మాట్లాడుతూ, రెస్క్యూ ఆపరేషన్‌లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం తెసుకుంటున్నానంటూ సుఖ్విందర్ సింగ్ సుఖూ వివరించారు.
