Vizag Accident: రోడ్డు ప్రమాదాల కారణంగా యువత తమ జీవితాలను అర్ధాంతరంగా ముంగిచేస్తున్నారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలో జరిగిన ఓ యువకుడి యాక్సిడెంట్ ఘటన.. తీవ్ర చర్చకు తావిస్తోంది. పట్టుబట్టి మరి తల్లిదండ్రుల చేత ఖరీదైన బైక్ ను కొనిచ్చుకున్న అతడు.. వారం తిరగకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదానికి కారణమైంది.
వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావుకు హరీష్ (19) అనే కుమారుడు ఉన్నాడు. అతడు ఇంటర్ వరకూ చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల బైక్ కావాలని అడిగితే డబ్బుల్లేవని తండ్రి సముదాయించాడు. అయినా హరీష్ వినకుండా బైక్ కావాల్సిందేనని పట్టుబట్టాడు. తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు.
దసరా రోజున కొత్త బైక్
బిడ్డ ఎంతటికి మాట వినకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు అప్పుచేసైనా బైక్ కొనివ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా దసరా రోజున ఏకంగా రూ.3 లక్షలు పెట్టి కొత్త బైక్ కొనిచ్చారు. షోరూం బైక్ ను తీసుకున్న అనంతరం ఆలయానికి తీసుకెళ్లి పూజలు సైతం నిర్వహించారు. ఇక కొత్త బైక్ చేతికి రావడంతో హరీష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
టిఫిన్ చేసి వస్తుండగా ప్రమాదం
తాజాగా టిఫిన్ చేయడానికి విశాఖ ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు హరీష్ తన స్నేహితుడు వినయ్ తో కలిసి కొత్త బైక్ పై వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత వినయ్ ను ఇంటి వద్ద దించేందుకు బైక్ పై మీతిమీరిన వేగంతో బయలుదేరాడు. ఈ క్రమంలో సిరిపురం దత్ ఐలాండ్ మలుపు బైక్ ఒక్కసారిగా అదుపుతప్పింది. హరీష్, వినయ్ ఇద్దరు అమాంతం బైక్ నుంచి కిందపడిపోయారు. హరీష్ కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో అతడ్ని కేజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మరోవైపు బైక్ పై వెనక కూర్చున్న వినయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
Also Read: Airtel Offers: రూ.500లోపు ఎయిర్‌టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. బడ్జెట్‌లో భలే మంచి బెన్‌ఫిట్స్!
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
బిడ్డ మరణవార్త విని ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు దంపతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అండగా ఉండాల్సిన వయసులో తమను దిక్కులేని వాళ్లను చేసి వెళ్లిపోయావా అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. కొత్త బైక్ కొనివ్వడం వల్లే తమ బిడ్డను కోల్పోయామని వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. దసరాకు బైక్ కొనివ్వకుండా ఉండి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతోనే ఉండేవాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు యాక్సిడెంట్ ఘటనపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
