Hydraa: అనుమతులు లేని లే ఔట్లలో రహదారులు, పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయంటూ హైడ్రా(Hydraa) ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 60 అడుగుల వెడల్పుతో ఉండాల్సిన రహదారులను ఇరువైపులా ఆక్రమణలకు గురవుతున్నట్లు, డబ్బాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఖాళీ చేయమంటే దాడి చేస్తున్నారంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొని సరైన రహదారులు, పార్కులు లేక ఇబ్బందులు పడొద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganadh) సూచించారు. హెచ్ ఎండీఏ(HMDA), డీటీసీపీ(DTCP) అనుమతి పొందిన లే ఔట్లలో ప్లాట్లు కొంటే రహదారులు, పార్కులు నిర్దేశిత లెక్కల ప్రకారం ఉంటాయని ఆయన సూచించారు.
ప్రభుత్వ భూమి కబ్జా..
బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్‌రీచ్ ప్రాంతంలో సర్వే నంబరు 83లో వరకుంట చెరువు కబ్జాలను నివారించాలని, బాచుపల్లి(Bachupally) మండలంలోని నిజాంపేట సర్వే నెంబరు 233/15లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్(Medchel) జిల్లా కాప్రా మండలం జవహార్‌నగర్ విలేజ్‌లో తన తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడంతో అప్పట్లో ఇచ్చిన భూమిని స్థానికంగా ఉన్నవారు కబ్జా చేసేశారని అతని కుమారుడు ఫిర్యాదు చేశారు. ఇలా సోమవారం హైడ్రా(Hydraa) ప్రజావాణికి మొత్తం 41 ఫిర్యాదులందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఎక్కువగా రహదారులు, పార్కుల ఆక్రమణలే ఉన్నాయని, ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
Also Read: Krishna Mohan Reddy: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ఫిర్యాదులిలా..
శేరిలింగంపల్లి మండలం మాధాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి వాస్తవానికి 60 అడుగుల వెడల్పుతో ఉండగా, కొంతమంది డబ్బాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటుండగా, అదే మార్గంలో కొంత దూరం వెళ్లాక ఏకంగా వసతి గృహాలను నిర్మించేశారని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డబ్బాలను తొలగించాలని హై కోర్టు(High Cort) ఆదేశాలున్నాయని, ఆ ప్రకారం గతంలో తొలగించగా, ఇటీవల మళ్లీ వాటిని పెట్టి రోడ్డును కబ్జా చేసేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖాళీ చేయమంటే తమను బెదిరిస్తున్నారని లేని పక్షంలో రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
రెండు లింకు రోడ్డులు ఆక్రమణ
మేడ్చల్ జిల్లా బూరంపేట గ్రామం సర్వే నెంబరు 166/3 లోని ప్రభుత్వ భూమిలో దాదాపు కిలోమీటరు మేర 60 మీటర్ల వెడల్పులో రహదారి నిర్మించి, పైన ఉన్న వెంచర్లకు దారి చూపుతున్నారని వెంటనే ఆక్రమణలను ఆపాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కిలోమీటర్ల మేర కబ్జా జరుగుతోందని వాపోతున్నారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా హయత్ నగర్(Haythnagar) మండలం ఆదిత్యనగర్ – బాలాజీ నగర్ మధ్య రెండు లింకు రోడ్డులు ఆక్రమణకు గురయ్యాయని, పార్కు స్థలం కూడా కబ్జాకు గురైందని వెంటనే ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదిత్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం సాయిప్రియానగర్‌లో 2500ల ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2 వేల గజాల పార్కు ఒకటి ఉండగా, దానిని కూడా ప్లాట్లుగా చేసి విక్రయించేస్తున్నారంటూ సాయిప్రియా నగర్ నివాసితులు పిర్యాదు చేశారు.
Also Read: OTT Release This Week: సినీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..
