West Bengal-Bhutan: ప్రకృతి అందాలకు నెలవైన బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతం ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో ఆ ప్రాంతం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి డార్జిలింగ్ లో ఇప్పటివరకూ 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బెంగాల్‌కు భూటన్ హెచ్చరిక
బెంగాల్ కు సరిహద్దు దేశంగా ఉన్న ఎగువన భూటన్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి తలా హైడ్రోపవర్ డ్యామ్ నిండుకుండలా మారిపోయింది. అయితే నీటిని విడుదల చేసే గేట్లు సాంకేతిక లోపం కారణంగా మెురాయించినట్లు ఆ దేశ నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రాలజీ అండ్ మెటియరాలజీ (NCHM) వెల్లడించింది. డ్యామ్ గేట్లు సరిగా పనిచేయకపోవడంతో నీరు డ్యామ్ పైభాగం మీదుగా పొంగిపోతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భూటాన్ ప్రభుత్వం.. బెంగాల్ రాష్ట్రానికి అధికారిక హెచ్చరిక జారీ చేసింది. దిగువ ప్రవాహ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఎన్డీఆర్ఎఫ్ అలెర్ట్..
మరోవైపు భూటాన్ హెచ్చరికల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అప్రమత్తం అయ్యింది. ఇందులో భాగంగా డ్యామ్ కు దిగువన ఉన్న ఆలిపుర్‌దువార్‌లోని సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు చెప్పింది. సెలవులో ఉన్న సిబ్బందిని సైతం తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించినట్లు ఎన్ డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే సిలిగురి నుంచి మరో 15 మంది సిబ్బందిని.. ఆలిపుర్ దువార్ కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. వీరు ఇండో-భూటాన్ సరిహద్దు వద్ద తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను బలోపేతం చేస్తారని స్పష్టం చేశారు.
24 గంటల్లో 26 సెం.మీ వర్షపాతం
డార్జిలింగ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి మిరిక్, సుఖియా పోఖరి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల వంతెనలు సైతం దెబ్బతిన్నాయి. అకస్మిక వరదల కారణంగా అనే ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. మిరిక్ పట్టణంలో కొండచరియలు విరిగిపడగా.. శిథిలాల నుంచి 13మంది మృతదేహాలను వెలికి తీశారు. కాగా డార్జిలింగ్ లో సగటున 24 గంటల వ్యవధిలో (శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకూ) 26.1 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కూచ్ బీహార్లో 19.2 సెం.మీ, జల్పాయిగురిలో 17.2 సెం.మీ వర్షం కురిసినట్లు తెలిపింది. గజోల్డోబా ప్రాంతంలో ఏకంగా 30 సెం.మీ వరకు వర్షం పడినట్లు వివరించింది.
Also Read: Indian Origin Shot Dead: అమెరికాలో ఘోరం.. ‘బాగానే ఉన్నావా?’ అన్నందుకు.. భారతీయుడ్ని చంపేశాడు
ఎన్‌డీఆర్ఎఫ్ అధికారి మాటల్లో..
ఎన్డీఆర్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహ్సెన్ షాహెది మాట్లాడుతూ ఇప్పటికే డార్జిలింగ్, సిలిగురి, ఆలిపుర్‌దువార్‌లకు మూడు బృందాలు పంపబడినట్లు చెప్పారు. మరో రెండు బృందాలు మాల్దా, కోల్‌కతా నుంచి బయలుదేరాయని పేర్కొన్నారు ‘కనిపించకుండా పోయిన వారిని వెతకడం, చిక్కుకుపోయిన గ్రామస్తులను రక్షించడం వంటి పనుల్లో మా సిబ్బంది నిమగ్నమై ఉన్నారు’ అని ఆయన తెలిపారు.
