Seethakka: కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థిని పార్టీ శ్రేణులు గెలిపించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Seethakka) సూచించారు . కొత్తగూడ, గంగారం మండలాల్లో మంత్రి సీతక్క పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి లను గెలిపించుకొని జిల్లా కేంద్రంలో జడ్పీ ఛైర్మన్ పదవిని వశం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలను అత్యధికంగా కైవసం చేసుకుని ఎంపీపీ పదవిని సైతం కాంగ్రెస్ పార్టీ వశం చేసుకోవాలని వివరించారు.
Also Read: ASP Vikranth Kumar Singh: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అండగా మేముంటాం: ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి
కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తల సలహాలు, సూచనల మేరకే అధిష్టానానికి అభ్యర్థుల పేర్లను నివేదిస్తామన్నారు. అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని నిర్ణయించిన అందరు దృఢ సంకల్పంతో పనిచేసే పార్టీని అత్యధిక సీట్లు గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వెల్లడించారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ప్రభంజనం సృష్టించినప్పటికీ ఉమ్మడి కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచులను గెలుచుకున్నామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో కొత్తగూడ కార్యకర్తలు, నాయకులు చూపించారు
దీంతో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో కొత్తగూడ కార్యకర్తలు, నాయకులు చూపించారని అభినందించారు. కొత్తగూడ గంగారం మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. కొత్తగూడ గంగారం మండలాల్లోని కార్యకర్తలు లాంటి వారిని రాష్ట్రవ్యాప్తంగా తయారుచేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చి, ఆ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ నాయకుని పై ఉందని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల కల్పన
గత ప్రభుత్వం పాలించిన పదేళ్ల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరిట తెలంగాణ సాధించుకుంటే వాటన్నిటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలు వదిలిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువత కు ఉద్యోగాల కల్పన చేసి యువత కలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.
పథకాలను ప్రజలందరికీ చేర్చే విధంగా ప్రభుత్వం కృషి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి కాంగ్రెస్ కండువా కప్పి సీతక్క పార్టీలోకి ఆహ్వానించింది. కొత్త, పాత కలయికలతో కొత్తగూడ, గంగారం మండలాల్లో కొత్త కాలనీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగా వచ్చారని వారిని కించపరిచే విధంగా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు అన్నదమ్ముల చూసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి కచ్చితంగా అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
