Strange Incident: దేశంలో జరుపుకునే అతిపెద్ద హిందూ పండగల్లో దసరా ఒకటి. ఆ రోజున ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సైతం ఉద్యోగులకు సెలవును మంజూరు చేస్తాయి. కొన్ని కార్పోరేట్ కంపెనీలు దసరాను వర్కింగ్ డేగా ప్రకటించిన నేపథ్యంలో పై అధికారుల అనుమతితో కొందరు స్వయంగా లీవ్ తీసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా సెలవు తీసుకోవడమే ఓ ఉద్యోగి పాలిట శాపంగా మారింది. దుర్గా పూజ (దసరా) రోజు సెలవు తీసుకున్న కారణంగా ఒక టెక్కీ తన జాబ్ ను కోల్పోయాడు.
బాధితుడి మాటల్లో..
భారతీయ టెక్కీ ఓ స్టార్టప్ కంపెనీలో తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘రెడ్డిట్’ (Reddit) వేదికగా పంచుకున్నాడు. దుర్గా పూజకు లీవ్ తీసుకున్న కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయానంటూ వాపోయాడు. తన సెలవుకు అప్రూవ్ లభించినప్పటికీ జాబ్ పోవడం విస్మయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సెలవుకు సంబంధించి 3 వారాల ముందే కంపెనీ సీఈఓ వద్ద అనుమతి తీసుకున్నట్లు బాధిత వ్యక్తి తెలిపాడు. అయినా నాపై ఇలాంటి చర్య తీసుకున్నారని వాపోయాడు.
‘కష్టాపడినా ఫలితం లేదు’
కంపెనీ కోసం గత 4 నెలలుగా ఎంతో కష్టపడి పనిచేసినట్లు బాధిత వ్యక్తి తెలియజేశాడు. సంస్థకు అవసరమైనప్పుడు అదనపు గంటలు కూడా వర్క్ చేసినట్లు పేర్కొన్నాడు. అయినప్పటికీ తొలగించడం తనకు ఎక్కడాలేని బాధను కలిగిస్తోందని అన్నాడు. ‘నాకు రిలీవింగ్ లెటర్, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్, పే స్లిప్స్ వంటి పత్రాలు ఇస్తారా? లేదా? తెలియడం లేదు. ఈ పరిస్థితిలో నేను ఏమి చేయాలో దయచేసి సూచించండి’ అని రెడ్డిట్ పోస్టులో రాసుకొచ్చాడు.
Also Read: Gill – Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. వన్డే కెప్టెన్‌గా శుభమన్ గిల్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
‘నీకు మంచి జాబ్ వస్తుంది’
సెలవు కారణంగా జాబ్ కోల్పోవడంపై రెడ్డిట్ యూజర్లు సైతం షాక్ కు గురవుతున్నారు. అయితే అంతకంటే మంచి జాబ్ మీకు వస్తుందిలే అని బాధితుడికి భరోసా కల్పిస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ ‘చిన్న స్టార్ట్‌అప్స్‌లో ఇలాంటి విషయాలు తరచుగా జరుగుతాయి. బాధ పడవద్దు, త్వరలోనే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది’ అని రాశారు. మరో యూజర్ వ్యాఖ్యానిస్తూ ‘నీ పెద్ద తప్పు ఏంటంటే కంపెనీ కోసం అదనపు గంటలు పని చేయడమే’ అని పేర్కొన్నారు. ‘స్ట్రాంగ్ గా ఉండు మిత్రమా. దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని అంతకంటే మంచి ఉద్యోగం సాధించు’ అని ఇంకో నెటిజన్ ధైర్యం చెప్పారు.
