Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్ఎంపీల(RMP) వైద్యం హద్దు మీరుతోంది ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీలు ప్రొఫెషనల్ వైద్యుల మాదిరి చికిత్స చేస్తున్నారు. మెడిసిన్ చదివిన వారు ఇస్తున్న మందుల కంటే కొందరు ఆర్ఎంపీలు ఇస్తున్న యాంటీబయోటిక్సే ఎక్కువ. వీరిపై ప్రజలకు ఉన్న గుడ్డి నమ్మకమే కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. గ్రామాలలో వ్యవసాయ పనులు చేసుకునే వారికి జ్వరం వచ్చినా, అనారోగ్యం పాలైన రెండు ఇంజక్షన్లు వేసి అవసరం లేకున్నా సెలైన్లతో పాటు యాంటీబయాటిక్స్ అంటగట్టి అందిన కాడికి లాగుతున్నారు.
కేవలం ప్రధమ చికిత్సకు మాత్రమే పరిమితం కావలసిన ఆర్ఎంపీలు నర్సింగ్ హోమ్ తరహాలో బెడ్లు వేసి మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వైద్యాధికారులు సైతం తప్పని పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించిన షాపులను సీజ్ చేస్తున్నా కొన్ని రోజులకే వైద్యాధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తాజాగా సుంకులమ్మ మెట్టు సమీపంలో ఉన్న ప్రధమ చికిత్స కేంద్రాన్ని వైద్యాధికారులు సీజ్ చేయగా కొన్ని రోజులకే బెడ్ కెపాసిటీతో ఉన్న కేంద్రాన్ని ఓపెన్ చేసి ఓపీలు చూస్తున్న సంఘటనే ఉదాహరణ. తూతూ మంత్రంగా కొనసాగే తనిఖీలతో జిల్లాలో ప్రైవేట్ వైద్య మాఫియా చెలరేగిపోతోంది.
యథేచ్ఛగా యాంటీబయోటిక్స్ వినియోగం
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంతో పాటు గ్రామాలలో మార్కెట్ ను బట్టి 4 నుంచి 8 ప్రథమ చికిత్స కేంద్రాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి .గతంలో వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స కేంద్రాలలో తనిఖీలు చేసి పరిమితికి మించి అధిక డోస్ ఇస్తున్న కొన్ని కేంద్రాలను గుర్తించి నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వైద్యాధికారుల పలు తనిఖీలలో ప్రథమ చికిత్స నిర్వహించు రోగులకు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించడం, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ స్థిరాయిడ్స్, సిరప్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జిల్లా అధికారులు గుర్తించారు. ప్రిస్క్రిప్షన్ రాయడం, రోగులకు రక్త పరీక్షలు(Blood tests) కొరకు టెస్టులు రాయడం, వాంతులు, బేదులు, జ్వరము ఉన్న రోగులకు చికిత్సలు చేసి, గ్లూకోజ్ బాటిళ్లు ఎక్కించడం, నేబిలైజేషన్ మిషన్, కుట్లు వేసే సామాగ్రి కలిగి ఉండడం వంటి వాటిని అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఆర్ఎంపీలు పేరుకు ముందు డాక్టర్ అని రాసి ఉంచిన సర్టిఫికెట్ (ప్రవేట్ హాస్పిటల్స్ ఇచ్చిన సర్టిఫికెట్) తన ప్రథమ చికిత్స కేంద్రంలో డిస్ప్లే చేయడము, ప్రవేట్ హాస్పిటల్స్ కు, స్కానింగ్ సెంటర్లకు రెఫెర్ చేసే,రెఫరల్ స్లిప్స్ కలిగి ఉండడం, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు అన్ని రకాల వయసుల వారికి, చికిత్సలు ఇవ్వడాన్ని, అధికారులు గుర్తించారు.
Also Read: Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత
అర్హత లేకుండా ప్రిస్క్రిప్షన్..
అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రంలో, బయో మెడికల్ వేస్టేజ్, ( సిరంజిలు, సూదులు, గ్లూకోజ్ బాటిల్స్, కాటన్,) బయో మెడికల్ రిజిస్ట్రేషన్ లేకుండా, బయో మెడికల్ వేస్టేజ్ ప్రాపర్ గా సెగ్రిగేషన్ చేయకుండా ఎక్కడపడితే అక్కడ వేయడంను అధికారులు గుర్తించారు. ప్రథమ చికిత్స కేంద్రము నిర్వాహకుడు కేవలము ప్రథమ అయినా తీరు మార్చుకొని కొందరు ఆర్ఎంపీలు ఇలాంటి యాంటీబయాటిక్స్ తో పాటు స్టెరాయిడ్స్ వంటి వాటిని రోగులకు ఇస్తున్నారు. స్పెషలైజేషన్ చేసి అన్ని అర్హతలు ఉన్న డాక్టర్లు మాత్రమే రాయాల్సిన మందులను గ్రామాలలో ఆర్ఎంపీలు రిఫర్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
కొందరు ఆర్ఎంపీలు అర్హత లేకుండా ప్రిస్క్రిప్షన్ రాయడంతో పాటు ప్రధమ చికిత్సకు వచ్చే రోగులకు ఇంజక్షన్లు చేస్తున్నారు. ఆర్ఎంపీల వద్దకు వచ్చిన వారి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండా ఇస్తున్న మందులు భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొందరు ఆర్ఎంపీలు,పీఎంపీలు క్లినిక్ కు అనుబంధంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్స్ నిర్వహిస్తూ రోగనిర్దారణ పరీక్షలు కూడా చేస్తున్నారంటే వారి దందా ఏ మేరకు కొనసాగుతుందో అర్థమవుతోంది.
ప్రైవేట్ ఆసుపత్రులతో కమిషన్ దందాలు
కొందరు ఆర్ఎంపీలు ఆరోగ్య సమస్య తీవ్రత దృష్ట్యా హైదరాబాద్(Hyderabad), జిల్లాకు సమీపంలోని కర్నూల్ వంటి నగరాలలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్స్ కుమ్మక్కై ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రథమ చికిత్స కోసం వచ్చిన వారికి లేని రోగాన్ని అంటగట్టి తాము ఏజెంట్లుగా పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి(Private Hospital)కి వెళ్లాలని సూచిస్తున్నారు. సదరు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు రోగం చిన్నదే అయినా ఆ భయాన్ని పెద్దగా చూపి వేలలో బిల్లులు చేస్తూ దండుకుంటున్నారు. ఒక్కో పేషెంట్ ను రెఫర్ చేస్తే రోగాన్ని బట్టి 40 శాతం నుంచి 50% కమిషన్ రూపంలో అమాయకుల ప్రాణాలను అడ్డం పెట్టుకొని దోచేస్తున్నారు. అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఇలాంటి ఆర్ఎంపీలు, పీఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ల్యాబ్ లలో చేసే పరీక్షలు సైతం ఒక్కో కేంద్రానికి ఒక్కోరకంగా ఫలితాలు రావడంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. వైద్యాధికారులు నిష్పక్షపాతంగా ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా వృత్తి ధర్మాన్ని పాటించాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు :సిద్ధప్ప, జిల్లా వైద్యాధికారి.
ఆర్ఎంపీలు(RMP), పీఎంపీ(PMP)లు ప్రాథమిక చికిత్స కేంద్రాలు అని మాత్రమే బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అందులో ప్రాధమిక చికిత్స మాత్రమే అందించాలి. యాంటీబయాటిక్స్ ఇవ్వడం, రిసెప్షన్ రాయడం, పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవు. ఆర్ఎంపీలు బెడ్స్ వేసి చికిత్స అందించవద్దు. ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేయాలి. నిబంధనలు పాటించని వారి వివరాలు మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
Also Read: Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
