CM-Revanth-Reddy
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు

బ్యారేజీల రిపేర్లకు టెండర్లు ఆహ్వానం
ఈ నెల 15వరకు గడువు విధించిన ప్రభుత్వం
అదే రోజూ సాయంత్రం 5 గంటలకు టెండర్లు ఓపెన్
డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈఓఐ కోరుతూ నోటిఫికేషన్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram project) భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లను ఆహ్వానించింది. డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరుతూ జాతీయ స్థాయిలో నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెలువరించింది.  అనుభవం ఉన్న సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ డిజైన్లు చేయనుంది. ఈ నెల 15 వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు జలసౌధలోని కాన్ఫరెన్స్ హాల్‌లో టెండర్ సీల్ కవర్స్‌ను అధికారులు ఓపెన్ చేయనున్నారు.

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో పియర్స్‌ 2023 అక్టోబర్‌లో కుంగిపోవడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన విషయం విధితమే. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణపై ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనేక చర్చల అనంతరం ఐఐటీలకు అప్పగించాలన్న నిర్ణయం నుంచి నీటిపారుదల శాఖ వెనక్కి తగ్గింది. ఈవోఐ విధానంలోనే డిజైన్ల ఖరారుకు ఓకే చెప్పింది. తాజాగా పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆహ్వానం పలికింది. బ్యారేజీల పునరుద్దరణకు డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

ప్రభుత్వం బ్యారేజీల మరమ్మతులకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిన్నటివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయాయని, లక్షకోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. దానిపై పీసీఘోష్ కమిషన్‌ను వేసింది. అవినీతిని వెలికితీసే పనిలో నిమగ్నమైంది. కమిషన్ సైతం 660 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేయడంతో దానిని సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీబీఐ సైతం విచారణను ప్రారంభించింది. ఎఫ్ఐఆర్‌ను సైతం నమోదు చేసింది. విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. త్వరలోనే మళ్లీ ఇరిగేషన్ అధికారులతో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ను సైతం విచారించబోతున్నట్లు సమాచారం. కాగ్, విజిలెన్స్ కమిషన్, ఏన్డీఎస్ ఏ సైతం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పేర్కొన్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేసినా పనికిరాదని కాంగ్రెస్ పేర్కొంటుంది. తుమ్మడిహెట్టివద్ద ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ లు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలోనే మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు టెండర్లు పలువడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అస్త్రంగా టెండర్లు

కాంగ్రెస్ పార్టీకి, అటు బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ల ఆహ్వానం అస్త్రంగా మారనుంది. రైతు సంక్షేమంకోసమే బ్యారేజీల పునరుద్దరణకు టెండర్లుఆహ్వానించామని కాంగ్రెస్ వివరించేందుకు సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని, అందులో భాగంగానే లక్షకోట్ల ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించామని వివరించేందుకు సిద్ధమవుతుంది. ప్రాజెక్టు డీపీఆర్ నుంచి మేడిగడ్డ పియర్స్ కుంగే వరకు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ప్రజలను వివరించనున్నట్లు సమాచారం. అదే విధంగా బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి సిద్ధమవుతుంది. మూడు పియర్స్ కు మరమ్మతులు చేస్తే సరిపోతుందని, రైతులకు నీరందుతుందని మొదటి నుంచి తాము మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించలేదని, దీంతో గత యాసంగి రైతు వేసిన వరిపైరు ఎండిపోయిందని మండిపడుతుంది. కాళేశ్వరం నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ మరమ్మతులు చేస్తామన్న ప్రభుత్వం అడ్డుపడిందని ప్రభుత్వం తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకే టెండర్లు ఆహ్వానించిందని పేర్కొంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను ప్రజలకు మరోసారి వివరించేందుకు సిద్ధమవుతుంది.

Just In

01

Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్

Disqualification Hearing: నలుగురు ఎమ్మెల్యేల సుదీర్ఘ విచారణ.. నెక్స్ట్ ఏంటి?

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి సాంగ్.. సోనాక్షి సిన్హా అరిపించేసిందిగా!

Hydraa: నాలాల సమీపంలోని నివాసేతర భవనాలను హైడ్రా కూల్చివేత!

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం